46 సం.ల తర్వాత తెరుచుకున్న 3వ గది

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రముఖ శ్రీక్షేత్రంలో పూరీ జగన్నాథుడి ఆలయంలో రత్నభాండాగారం 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. దీంతో అందులో ఉండే సంపద గురించి దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా చూస్తోంది. జులై 14న (ఆదివారం) ఉదయం శుభ ఘడియల్లో రహస్య గదిని ప్రభుత్వ ఏర్పాటుచేసిన కమిటీ ఆధ్యర్యంలో తెరిచారు. ఆలయంలో రహస్యంగా ఉండే ఈ గది భక్తులకు కనిపించదు. శతాబ్దాల కిందట నిర్మితమైన ఈ ఆలయానికి ఎందరో రాజులు విలువైన ఆభరణాలు, మణులు, మాణిక్యాలను కానుకలుగా అందజేశారు. యుద్ధాలు చేసి.. శత్రువుల సంపదలను తీసుకొచ్చి పురుషోత్తమునికి సమర్పించుకున్నారు. ఈ సంపదను ఆలయంలోని మూడు గదుల్లో భద్రపరిచారు.పూరీ జగన్నాథుడి గర్భాలయం వెనుక శయన మందిరం.. దీనికి ఎడమవైపు రత్నభాండాగారం ఉంటాయి. ఇందులో మూడు గదులు ఉండగా… తొలి గదిలో స్వామివారి నిత్యసేవలకు అవసరమైన ఆభరణాలు.. పండగలు, ఉత్సవాల్లో ముగ్గురు మూర్తులు తొడిగే అలంకారాలున్నాయి. మూడో గదిలో మాత్రం వెలకట్టలేని సంపదను కర్రపెట్టెల్లో ఉంచి భద్రపరిచారు.ఎటువంటి దీపాలు లేకుండా చీకటిగా ఉండే ఈ రహస్య గదిలో ఎక్కడ ఏముందన్న దానిపై ఎవరికీ అవగాహన లేదు. ఈ సంపదలను లోకనాథ్‌ స్వామి పర్యవేక్షిస్తుంటారు. అలాగే, శ్రీక్షేత్రానికి రక్షణగా ఉన్న శక్తి స్వరూపిణి విమలా దేవి, మహాలక్ష్మిలు అన్ని వేళలా రత్న భాండాగరానికి రక్షణగా ఉంటారు. ప్రస్తుతం సంపదలను లెక్కింపునకు శయన మందిరానికి సమీపంలో ఎడమవైపున ఉన్న ఒక గదిని స్ట్రాంగ్‌రూంగా ఉపయోగిస్తున్నారు.రహస్య గదుల్లోని సంపదను గుగ్గిలం కలపకు లోపల ఇత్తడిపూత పూసిన ఆరు భారీ సైజు పెట్టెల్లో భద్రపరిచి స్ట్రాంగ్‌రూంకు తరలించి.. ఆ తరువాత లెక్కిస్తారు. అయితే, తొలుత రత్నభాండాగారానికి మరమ్మతులు చేసి, ఆ తరువాత లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మరమ్మతుల బాధ్యత పురావస్తుశాఖకు అప్పగించారు. ఈ పనులు ముగిసిన తరువాత స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచిన ఆభరణాలు మళ్లీ రహస్య గదికి తరలించి లెక్కిస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. వివిధ పనుల కోసం ప్రత్యేక కమిటీలను నియమించింది.ఇక, భాండాగారం తలుపులు తెరుచుకున్న తరువాత పెద్ద సంఖ్యలో గబ్బిలాలు వెలుపలకు వచ్చాయి. చుట్టూ చీకట్లు ఉండటం వల్ల హైమాస్ట్‌ సెర్చ్‌ దీపాలతో ప్రతినిధి బృందం లోపలికి వెళ్లింది. ఈ వెలుగులతో గబ్బిలాలు ఒక్కసారిగా బయటకు వెళ్లిపోయాయి. రహస్య గదిలో ఏం ఉంది? అనేది బృందం వెల్లడించే వివరాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.