77వ రోజులు..వెయ్యి కిలోమీటర్లు

- ..లోకేష్ పాదయాత్రకు జనం నీరాజనాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దూసుకెళ్తున్నారు. లోకేష్ పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ప్రతీ చోట లోకేష్‌‌కు ఘన స్వాగతాలు పలుకుతున్నారు. పెద్దఎత్తున ప్రజలు యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నారు. జనవరి 27న ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర నేటికి 77వ రోజుకు చేరుకుంది. ఈరోజు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను యువనేత పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభలో ఆయన మాట్లాడనున్నారు. శుక్రవారం ఉదయం ఆదోని నియోజకవర్గం ఆదోని శివారు క్యాంప్ సైట్ నుంచి 77వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. ఈ రోజు ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద 1000 కిలోమీటర్ల పాదయాత్రను యువనేత పూర్తి చేసుకుంటారు. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 6 గంటలకు కడికత్త క్రాస్ వద్ద బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడనున్నారు.నిన్న 76వ రోజు పాదయాత్రను ఆలూరు నియోజకవర్గం ములిగుందం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించగా.. కాసేపటికే ఆలూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర పూర్తి అయ్యింది. ఆదోని నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగ ఆదోని నియోజకవర్గంలో స్థానికులు, పలు సామాజిక వర్గీయులు, ప్రజలతో లోకేష్ సమావేశమైన వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం  అధికారంలోకి రాగానే సమస్యలను తీరుస్తానని యువనేత హామీ ఇచ్చారు. అలాగే ఆరేకల్లులో ప్రభుత్వ మైనార్టీ ఉర్ధూ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీ పనులు నిలిచిపోవడంపై మండిపడ్డారు. మైనార్టీలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విరుచుకుపడ్డారు. మైనారిటీలపై ఎందుకంత కక్ష జగన్ రెడ్డీ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు సాక్షీభూతం… అర్థంతరంగా నిలచిపోయిన ఈ కళాశాల నిర్మాణమన్నారు. ఆదోని నియోజకవర్గం ఆరేకల్లులో ప్రభుత్వ మైనార్టీ ఉర్ధూ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీకి టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.7 కోట్లు నిధులు కేటాయించి, నిర్మాణ పనులు కూడా ప్రారంభించామని తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా ఈ నిర్మాణాలను అంగుళం కూడా ముందుకు సాగనీయకుండా పాడుబెట్టారని మండిపడ్డారు. కొత్తగా పనులు చేపట్టడం ఎలాగూ చేతగాదని… గతంలో ప్రారంభించిన పనులైనా పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.