ఒకే సారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం

- ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలోకాలేజీల‌ను ప్రారంబించిన సీఎం - చాలా ఆత్మసంతృప్తి క‌లిగే గొప్ప స‌న్నివేశం: సీఎం కేసీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఉజ్వ‌ల‌మైన దినం ఇది. ఒకే సారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభించుకోవ‌డం.. సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో 9 మెడిక‌ల్ కాలేజీల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంటాం. కానీ ఈ కార్య‌క్ర‌మం చాలా ఆత్మసంతృప్తి క‌లిగే గొప్ప స‌న్నివేశం. ఎందుకంటే ప‌రిపాల‌న చేత‌కాదు అని ఎగ‌తాళి చేసిన ప‌రిస్థితుల‌ను చూశాం. అటువంటి తెలంగాణ‌లో ప్ర‌తి జిల్లాకు మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సంవ‌త్స‌రంలో దాదాపు 24 వ‌ర‌కు చేరుకున్నాం. గ‌తంలో ఐదు మెడిక‌ల్ కాలేజీలు ఉంటే.. ఇవాళ ఆ సంఖ్య 26కు చేరింది. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి 8 కాలేజీలు నూత‌నంగా ప్రాంరంభం కాబోతున్నాయి. వీటికి కేబినెట్ ఆమోదం కూడా ల‌భించింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.

10 వేల మంది డాక్ట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌బోతున్నాం..

2014లో 2850 మెడిక‌ల్ సీట్లు ఉంటే 2023 నాటికి 8515 మెడిక‌ల్ సీట్లు ఉన్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా వైద్య‌శాఖ మంత్రి, కార్య‌ద‌ర్శిని హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. 85 శాతం మెడిక‌ల్ సీట్లు తెలంగాణ బిడ్డ‌ల‌కే ద‌క్కాల‌ని ప‌టిష్టంగా పోరాటం చేసి హైకోర్టులో విజయం సాధించాం. అది గొప్ప విజ‌యం. ప్ర‌యివేటు, గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీల ద్వారా సంవ‌త్స‌రానికి 10 వేల మంది డాక్ట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌బోతున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.

తెల్ల ర‌క్త క‌ణాల మాదిరిగానే తెలంగాణ తెల్ల కోట్ డాక్ట‌ర్లు ప‌ని చేస్తారు..

మ‌నిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగ నిరోధ‌క శ‌క్తి ఉండాలంటే.. తెల్ల ర‌క్త క‌ణాలు ఏ విధంగా ప‌ని చేస్తాయో.. తెలంగాణ ఉత్ప‌త్తి చేయ‌బోయే తెల్ల కోట్ డాక్ట‌ర్లు రాష్ట్రానికే కాదే.. దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను కూడా కాపాడుతారని కేసీఆర్ వివ‌రించారు. ఇందులో ఎవ‌రికి సందేహం లేదు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. విద్యుత్ రంగంతో పాటు సాగు, తాగునీటి రంగంలో అద్భుతాలు సాధించాం. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం. గంజి కేంద్రాల‌తో విల‌సిల్లిన‌ ఉన్న పాల‌మూరు జిల్లాలో ఇప్పుడు వ్య‌వ‌సాయం ప‌రుగులు పెట్టింది. పాల‌మూరు ప్రాజెక్టు ప్రారంభించుకోబోతున్నాం. ఒక్క కాలేజీ లేని పాల‌మూరులో ఐదు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయి. ఇది గొప్ప విజ‌యం. న‌ల్ల‌గొండ‌లో మూడు కాలేజీలు వ‌చ్చాయి. మారుమూల జిల్లాలైన ఆసిఫాబాద్, ములుగు, భూపాల‌ప‌ల్లి జిల్లాలు.. అలా అడ‌వి బిడ్డ‌లు నివ‌సించే ప్రాంతాల్లో కూడా మెడిక‌ల్ కాలేజీలు స్థాపించుకొని అద్భుతాలు సృష్టించ‌బోతున్నామ‌ని కేసీఆర్ తెలిపారు.

50 వేల ప‌డ‌క‌ల‌కు చేరుకోబోతున్నాం..

ఒక దేశం కావొచ్చు.. రాష్ట్రం కావొచ్చు.. ఎక్క‌డైతే వైద్యారోగ్య వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంటుందో.. అక్క‌డ త‌క్కువ మ‌ర‌ణాలు, న‌ష్టాలు సంభ‌విస్తాయని కేసీఆర్ తెలిపారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మెడిక‌ల్ కాలేజీల‌తో పాటు అద్భుత‌మైన ఆస్ప‌త్రుల‌ను కూడా తీసుకువ‌స్తున్నాం. వంద‌లాది బెడ్స్‌తో మెడిక‌ల్ ఫెసిలిటీ వ‌స్తుంది. వైద్యారోగ్య శాఖ చాలా విజ‌యాలు సాధించింది. దేశంలో ప్ర‌తి ల‌క్ష జ‌నాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇది మ‌న సాధించిన ఘ‌న‌త‌. రాష్ట్రం ఏర్ప‌డే నాటికి 17 వేల ప‌డ‌క‌లు ఉంటే.. ఇప్పుడు 34 వేల ప‌డ‌క‌ల‌కు చేరుకున్నాం. మ‌రో 6 హాస్పిట‌ల్స్ నిర్మాణంలో ఉన్నాయి. వ‌రంగ‌ల్‌లో అద్భుత‌మైన హాస్పిట‌ల్ నిర్మాణం జ‌రుగుతోంది. హైద‌రాబాద్‌కు న‌లువైపులా టిమ్స్ నిర్మిస్తున్నాం. గ‌చ్చిబౌలి, ఎల్‌బీ న‌గ‌ర్, అల్వాల్, ఎర్ర‌గ‌డ్డలో 1000 ప‌డ‌క‌ల చొప్పున హాస్పిట‌ల్స్ నిర్మిస్తున్నాం. నిమ్స్‌ను మ‌రో 2 వేల ప‌డ‌క‌ల‌తో విస్త‌రిస్తున్నాం. ఆస్ప‌త్రుల్లో ప‌డ‌క‌ల సంఖ్య 50 వేల‌కు చేరుకోబోతోంది. ఈ సంద‌ర్భంగా వైద్యారోగ్య శాఖ‌ను అభినందిస్తున్నాను అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

500 ట‌న్నుల ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి..

క‌రోనా టైంలో ఆక్సిజ‌న్ చాలా అవ‌స‌రం ఉండే. దాన్ని గుణ‌పాఠంగా తీసుకొని ఈరోజు వైద్యారోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో 500 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఎటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కోనేందుకు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించుకున్నాం. 50 వేల ప‌డ‌క‌ల‌ను ఆక్సిజ‌న్ బెడ్స్‌గా తీర్చిదిద్దుకుంటున్నాం. 10 వేల సూప‌ర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులోకి వ‌స్తున్నాయి. పారా మెడిక‌ల్ సిబ్బందికి జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. మెడిక‌ల్ కాలేజీల‌కు అనుబంధంగా.. ప్ర‌తి జిల్లాలో న‌ర్సింగ్ కాలేజీలు, పారా మెడిక‌ల్ కోర్సులు పెట్టాల‌ని చెప్పాం. వాటికి కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నారని సీఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.