ధరణిలో అందుబాటులోకి మరిన్ని సేవలు

- రెవెన్యూ శాఖ కసరత్తు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వ్యవసాయ భూ లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ధరణిలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) విజ్ఞప్తి మేరకు ధరణి పోర్టల్‌లో కొత్త మాడ్యూల్స్‌ ప్రవేశపెట్టేందుకు ఇటీవలే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ అనుమతి ఇచ్చారు. అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (ఏజీపీఏ), స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(ఎస్పీఏ), స్టాంపుడ్యూటీ సర్దుబాటు వంటి వాటితో పాటు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపేలా మరికొన్ని సేవలు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తున్నది. కంపెనీల భూములకు సంబంధించి కొత్త సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు సమాచారం. ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ 2020 అక్టోబర్‌ 27న ప్రారంభించారు. అప్పటి నుంచి క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పరిశీలిస్తూ, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఒక్కో మాడ్యూల్‌ను ప్రవేశపెడుతూ వస్తున్నది. మరోవైపు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా), ఆర్డీవోల సంఘం వంటి రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ధరణిలో కావాల్సిన అదనపు సేవలపై ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తున్నాయి. వీటన్నింటి ఆధారంగా కొత్త మాడ్యూల్స్‌ తేవాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. వీటికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ సిద్ధమైందని, టెస్టింగ్‌ జరుగుతున్నదని సమాచారం.

ఇప్పటికే 33 మాడ్యూల్స్‌

కొత్తగా వచ్చే సేవలను ప్రత్యేక మాడ్యూల్స్‌ రూపంలో తేవాలా? లేదా ఇప్పటికే ఉన్న మాడ్యూల్‌లో ఆప్షన్లుగా తేవాలా? అని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ధరణి పోర్టల్‌లో ప్రస్తుతం 33 రకాల మాడ్యూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరో మూడు, నాలుగు మాడ్యూల్స్‌ వస్తే డ్యాష్‌బోర్డ్‌ చాంతాడంత పొడవు అవుతుందని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత, కొత్త మాడ్యూల్స్‌లో ఒకేవిధమైన సేవలు అందించే వాటిని విలీనం చేసి, మాడ్యూల్స్‌ సంఖ్యను కుదించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఉదాహరణకు స్లాట్‌ బుకింగ్‌కు, స్లాట్‌ రీషెడ్యూల్‌కు (తేదీ మార్పు), స్లాట్‌ క్యాన్సిలేషన్‌ (రద్దు)కు మూడు మాడ్యూల్స్‌ వేర్వేరుగా ఉన్నాయి. ఈ మూడింటినీ ఒకే మాడ్యూల్‌లోకి తేవచ్చు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సేల్‌, గిఫ్ట్‌, సక్సెషన్‌ (ఫౌతి), పార్టిషన్‌ వేర్వేరుగా ఉన్నాయి. వీటిని కూడా ఒకే మాడ్యూల్‌ కిందికి తీసుకురావొచ్చు. ఇలా వీలీనం చేయడం వల్ల మాడ్యూల్స్‌ సంఖ్య తగ్గడంతోపాటు సేవలు మరింత సులభం అవుతాయని అధికారులు ఆలోచిస్తున్నారు.

20 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు

ధరణి పోర్టల్‌ సేవలు 2020 నవంబర్‌ 2వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు 20 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. నాలా కన్వర్షన్‌, పెండింగ్‌ మ్యుటేషన్లు, వివిధ మాడ్యూల్స్‌ కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారం.. వంటివన్నీ మినహాయిస్తే కేవలం భూముల అమ్మకాలు, వారసత్వ బదిలీలు, భాగపంపకాలు, బహుమతుల రూపంలోనే 20 లక్షలకుపైగా లావాదేవీలు జరిగాయి. దీంతోపాటు లక్షకుపైగా నాలా కన్వర్షన్‌ జరిగాయి.

Leave A Reply

Your email address will not be published.