సహజీవనం చేస్తున్న జంటల నమోదు కోసం.. సుప్రీంకోర్టులో పిల్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: పెళ్లి చేసుకోకుండా కలిసి జీవిస్తూ, సహజీవనం చేస్తున్న జంటల నమోదు కోసం నిబంధనలు, మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశాడు. సోమవారం దీనిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, పిటిషన్‌దారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుందేలు తెలివి మాదిరిగా ఈ ఆలోచన ఉందన్నారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించారు.దేశ రాజధాని ఢిల్లీలో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.  చంపిన తర్వాత ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచి ఆ తర్వాత పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆ తర్వాత ఇలాంటి తరహా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశాడు. దేశంలో సహజీవనం చేస్తున్న ప్రతి జంట తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకునేలా మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేయాలని కోర్టుకు విన్నతించాడు. కలిసి జీవిస్తున్న జంటలకు ఆ మేరకు సామాజిక భద్రత కల్పించాలని కోరాడు. లివ్‌ ఇన్‌ భాగస్వాముల వల్ల జరిగే నేరాలను ఈ ఆలోచన తగ్గిస్తుందని పేర్కొన్నారు.కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ పిల్‌పై మండిపడ్డారు. సహజీవనం చేస్తున్నవారు ఎవరి వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలి‌? కేంద్ర ప్రభుత్వం వద్దా? లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తులతో కేంద్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం?’ అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తుల భద్రతకు ప్రయత్నిస్తున్నారా? లేదా వ్యక్తులను లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండనివ్వకుండా చేస్తున్నారా? అని నిలదీశారు. సహజీవనం చేస్తున్న జంటలకు ఏ కారణాలతో భద్రత కల్పించాలనుకుంటున్నారు? అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. సామాజిక భద్రత కింద అని న్యాయవాది బదులివ్వగా ఆయనపై మండిపడ్డారు. ఇలాంటి పిల్స్‌పై ఖర్చులు వసూలు చేస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.