పోలవరం ఎత్తు పై ఎత్తు..జగన్ చెప్పినది కేంద్రానికి ఒక్కటేనా…?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ఆంధ్రప్రదేష్: ఏపీకి జీవనాడిగా పోలవరం ప్రాజెక్ట్ ని పేర్కొనాలి. ఇది బహుళార్ధక సాధక ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ఏపీకి సాగు నీటికి ఇబ్బంది ఉండదు అటువంటి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఆటంకాలు అనుమానాలు. ఇలా చాలా చోటు చేసుకుంటున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ విషయం తీసుకుంటే ఎనభయ్యేళ్ళ కల. 1940 దశకంలో పురుడు పోసుకున్న ఆలోచన.ఈ రోజున కూడా సాకారం కాలేదు అంటే పోలవరం విషయంలో ఎక్కడ దోషం ఉంది ఎక్కడ పాపం ఉంది అన్నది ఎవరికీ ఆర్ధం కావడంలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారు అని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఎత్తు తగ్గిస్తే పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ కానే కాదు. అదే టైం లో దాని మీద ఏపీ పెట్టుకున్న ఆశలు నెరవేరవు. అది జీవనాడి కూడా కాదు.
ఈ విషయంలో అందరి కంటే ముందే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ డౌట్ ని లేవనెత్తారు. అయితే నాడు ఈ విషయమే కొత్తగా అనిపించి ఎవరూ పట్టిచుకోలేదు. అయితే ఆ తరువాత వరసబెట్టి ఇదే విషయం మీద చర్చ సాగుతూ వస్తోంది. రీసెంట్ గా చూసుకుంటే వైఎస్సార్ ఆత్మ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కూడా ఈ విషయంలో జగన్ కి లేఖ రాశారు.పోలవరం ఎత్తు తగ్గించడం నిజం అయితే అంతకంటే ఆంధ్రులకు ద్రోహం చేసే విషయం ఉండదని కటువుగానే మాట్లాడారు. నిజంగా పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా ఈ విషయంలో ప్రభుత్వం చెబుతున్నదేంటి కేంద్రం ఆలోచనలు ఏంటి కేంద్రం వత్తిడికి ఏపీ తలొగ్గుతోందా అన్నదే చర్చనీయాంశంగా ఉంది.పోలవరం విషయానికి వస్తే ప్రస్తుతం దాని ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో చెప్పారు. ఇది తొలి దశ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు ఇక పోలవరం పూర్తిగా 45.7 మీటర్ల వెడల్పు వరకూ కడతామని జగన్ స్పష్టం చేశారు. ఇక పోలవరం విషయంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఆయన అన్నారు.పోలవరం లో ప్రవహించే ప్రతీ నీటి బొట్టూ వైఎస్సార్ పేరుతోనే ఉంటుందని ఆయన కష్టం ఆయన కలల ఫలితమే పోలవరం అన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు అబద్ధాలు తప్ప చేసింది ఏమీ లేదని జగన్ దుయ్యబెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలతో ఏమీ కాకుండా చేశారని నిందించారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కోటి నిర్మాణం చేసుకుంటూ వస్తున్నామని జగన్ అన్నారు.
పోలవరం విషయంలో వైఎస్సార్ కలను నెరవేర్చి పూర్తి చేసేది తామే అని ఆయన అన్నారు. నిర్వాసితులకు ఒక్కొక్కరికీ పది లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని జగన్ చెప్పారు. ఇదిలా ఉండగా పోలవరం విషయంలో కేంద్రం కూడా ఇదే సమయంలో ఒక ప్రకటన చేయడం విశేషం. కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కూడా పోలవరం ఎత్తు 41.15 మీటర్లు మాత్రమే అని చెప్పడం విశేషం. ఇదంతా తొలిదశలో సహాయం పునరావాసం పనులు పూర్తి అయినంతవరకే అని అన్నారు.నిజానికి 2023 ఫిబ్రవరి నాటికే ఈ పునరావాసం పూర్తి కావాలని ఆయన అంటూ మార్చి అయినా జాప్యం అవుతోందని వైసీపీ ఎంపీ భీశెట్టి సత్యవతి అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు. అంటే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం కేవలం 11677 మంది నిర్వాసితులకే సహాయం పునరావాసం కల్పించిందని కేంద్రం అంటోంది.
అయితే దానికి రెట్టింపు నిర్వాసితులు ఉన్నారు. మరో వైపు పోలవరం ప్రాజెక్ట్ అంచనాల విషయంలో కేంద్రం ఓకే చెప్పడం లేదు. 55 వేల కోట్ల రూపాయల పై చిలుకు మొత్తం ఖర్చు అవుతుందంటే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఇంకో వైపు పోలవరం ప్రాజెక్ట్ కో ఇరిగేషన్ కాంపోనెంట్ కంటే కూడా పునరావాసం ఖర్చు అధికంగా ఉంటుంది. దాదాపుగా 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అంటే కేంద్రం నిధులు ఇస్తే తప్ప కుదిరేది కాదు ఏపీ సర్కార్ అది పెట్టుకోవడం అసాధ్యం. మరి వయా మీడియాగా పోలవరం పునరాసం ఖర్చుని తగ్గించుకోవాలంటే ఎత్తుని తగ్గించడమే మార్గం అని భావిస్తే మాత్రం 41.15 మీటర్ల వద్దనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. దీని మీదనే తెలుగుదేశం సహా విపక్షాలు అంతా ద్వజమెత్తుతున్నాయి.అయితే చూడబోతే అసెంబ్లీలో జగన్ చెప్పినదీ కేంద్రం చెప్పినదీ ఒక్కలాగానే ఉంది. ఇది తొలి దశ అంటున్నారు. కానీ మలి దశ ఉంటే అది 45.7 మీటర్ల ఎత్తు రియల్ డిజైన్ ప్రకారం పూర్తి చేస్తేనే పోలవరానికి సార్ధకత అంటున్నారు. ఏది ఏమైనా పోలవరం చుట్టూ ఎత్తులు పై ఎత్తులు అలా సాగిపోతున్నాయి. మరి ఇందులో నిజమెంత జరిగేది ఎంత అసలు పోలవరం ఎత్తు విషయంలో ఎత్తులు ఎవరికి వ్యూహాలు ఎవరివి అన్నది తెలియాలంటే కాలానికే వదిలేయాలి.

Leave A Reply

Your email address will not be published.