తగ్గనున్న మందుల రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇకపై అన్ని అరుదైన వ్యాధుల చికిత్సల కోసం దిగుమతి చేసుకునే మందులు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం వినియోగించే ఆహారం పై కస్టమ్స్ సుంకం పూర్తిగా మినహాయించనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులు, ఔషధాల కోసం కస్టమ్స్ సుంకం ఉపశమనం కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞాపనలు వచ్చిన నేపథ్యంలో కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అరుదైన వ్యాధుల కోసం జాతీయ పాలసీ 2021 కింద జాబితా చేయబడిన వ్యాధుల చికిత్స కోసం.. వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్న అన్ని మందులు.. ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ఆహారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపును పొందేందుకు, వ్యక్తిగత దిగుమతిదారు కేంద్ర లేదా రాష్ట్ర డైరెక్టర్ హెల్త్ సర్వీసర్ నుంచి, జిల్లా వైద్య అధికారి/జిల్లా సివిల్ సర్జన్ నుండి సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఔషధాలపై 10 శాతంగా ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఉంది.కొన్ని వర్గాల ప్రాణాలను రక్షించే మందులు, టీకాలపై రాయితీ రేటు 5 శాతంగా కేంద్రం ఉంచింది. వెన్నెముక కండరాల క్షీణత, కండరాల బలహీనత చికిత్స కోసం ఇప్పటికే పేర్కొన్న ఔషధాలకు మినహాయింపులు ఇస్తూ ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10 కిలోల బరువున్న పిల్లలకు, కొన్ని అరుదైన వ్యాధుల చికిత్సకు వార్షిక ఖర్చు సంవత్సరానికి 10 లక్షల నుంచి 1 కోటి కంటే ఎక్కువ అవుతుంది. చికిత్స జీవితకాలం ఉండటం వల్ల ఔషధ మోతాదు ఖర్చు పెరుగుతుందని కేంద్రం అంచనా వేసింది. కస్టమ్స్ సుంకం మినహాయింపు వలన గణనీయమైన ఖర్చు ఆదా అవుతుందని రోగులకు అవసరమైన ఉపశమనం లభిస్తుందని కేంద్రం భావించింది. వివిధ క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే పెంబ్రోలిజుమాబ్ మందులకు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి కేంద్రం పూర్తిగా మినహాయింపు ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.