అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 14న అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నిర్వహించనున్న అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సీనియర్ అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి దార్శనికత మేరకు ఏర్పాట్లు ఘనంగా ఉండాలన్నారు.ప్రధాన వేదిక వద్ద బారికేడింగ్‌ ఏర్పాట్లు చేయాలని రోడ్డు, భవనాల శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆవరణ వద్ద సుందరీకరణ, మొబైల్‌ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేయాలని ఆమె GHMC అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఆధికారులను ఆమె ఆదేశించారు. అగ్నిమాపక శాఖ వారికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని ఆమె పేర్కొన్నారు. వేసవి కాలం దృష్ట్యా త్రాగు నీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను కూడా సిద్దంగా ఉంచాలని, అత్యవసర వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్‌ లను కూడా సిద్ధంగా ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు.పార్కింగ్, ప్రాంగణం వద్ద ఇతర ఏర్పాట్లను, పటిష్టం చేయడానికి శుక్రవారం సంయుక్తంగా సందర్శించాలని, తగిన ఏర్పాట్లు చేయడానికి R&B, పోలీస్, హెల్త్, సాంఘిక సంక్షేమ శాఖ, హైదరాబాద్ కలెక్టర్, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.DGP అంజనీ కుమార్, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఎస్.సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, టీఆర్‌ అండ్‌ బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, HMWSSB ఎండీ దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, ఎస్‌సీడీడీ కమిషనర్‌ యోగితా రాణా, సీడీఎంఏ సత్యనారాయణ, R&B ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.