మోదీ ప్రసంగంపై కేసీఆర్ రియాక్ట్ కాకపోవడం వెనుక అసలు కథ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఫరేడ్ గ్రౌండ్ వేదికగా కేసీఆర్ సర్కార్‌పై మాటల తూటాలు పేల్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్, బీఆర్ఎస్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా ఓ రేంజ్‌లోనే విమర్శలు గుప్పించారు. ఈ మధ్య బహిరంగ సభల్లో రాజకీయ విమర్శలు పెద్దగా చేయని ప్రధాని.. హైదరాబాద్ సభలో కూడా పెద్దగా పాలిటిక్స్ ప్రస్తావన తీసుకురాకపోవచ్చని బీజేపీ కార్యకర్తలు, నేతలు భావించారు. అయితే కమలం పార్టీ కార్యకర్తలు, నేతలకు ఊహకందని రీతిలో కేసీఆర్ సర్కార్‌‌ను కడిగిపారేశారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చినట్లయ్యింది. కుటుంబ పాలన, తెలంగాణ ప్రభుత్వం అవినీతి పాలన ఆఖరికి దర్యాప్తు సంస్థల వరకూ అన్ని విషయాలను ప్రస్తావిస్తూ మోదీ మాట్లాడారు. ప్రధాని తెలుగులో ప్రసంగం ప్రారంభించి మొదలుకుని ముగిసే వరకూ కార్యకర్తలు, అభిమానులు ఎనలేని ఉత్సాహంతో చాలా ఓపిగ్గా విన్నారు. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. ప్రెస్‌మీట్ పెట్టినా, బహిరంగ సభలు పెట్టినా బీజేపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడే ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీ విమర్శలపై.. అది కూడా హైదరాబాద్ వేదికగా ప్రధాని చేసిన కామెంట్స్‌పై ఇంతవరకూ స్పందించనే లేదు. ఏదో ఇద్దరు, ముగ్గురు ముఖ్యనేతలు మినహా ఎవరూ పెద్దగా కౌంటర్లు ఇవ్వలేకపోయారని బీఆర్ఎస్ శ్రేణులు కాస్త అసంతృప్తితో ఉన్నాయట. ఇంతకీ మోదీ విమర్శలపై కేసీఆర్ స్పందిస్తారా..? లేదా సార్ సప్పుడు చేయకుండా సైలెంట్‌గానే ఉండిపోతారా..? ఒకవేళ స్పందిస్తే ఎప్పుడు..? అనేదానిపై అటు బీజేపీలో.. ఇటు బీఆర్ఎస్‌లో ఒకటే చర్చ నడుస్తోంది.

ఏం జరుగుతుందో..!?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్‌ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయన్న విషయం విదితమే. ముఖ్యంగా టీఆర్ఎస్, బీఆర్ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్ అస్సలు ఆగలేదు. ప్రెస్‌మీట్ పెట్టినా.. బహిరంగ సభలు పెట్టిన మోదీ సర్కార్‌ను కడిగిపారేసేవారు. అయితే తెలంగాణలో గత కొన్ని రోజులుగా పెను ప్రకంపనలు రేపే ఘటనలు జరిగాయ్. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కోవడం, ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరుకావడం ఇదంతా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద రచ్చే అయ్యింది. ఇక తెలంగాణలో జరిగిన టీఎస్‌పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకించాయ్. TSPSC పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్‌కు సంబంధం ఉందని ఆరోపించిన వారందరికీ నోటీసులు ఇవ్వడం, ఆఖరికి పరువు నష్టం దావా వేయడం కూడా పెద్ద సంచలనమే. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి టెన్త్ పేపర్ లీకేజీలో పాత్ర ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం రచ్చ రచ్చే అయ్యింది. స్వరాష్ట్రంలో ఇంత జరిగినా, సర్కార్‌పై పెద్ద మచ్చ పడినా ఇంతవరకూ కేసీఆర్ అస్సలు స్పందించనే లేదు. ఇవన్నీ అటుంచితే.. కేసీఆర్ అడ్డాకే వచ్చిన మోదీ పరోక్షంగా ధ్వజమెత్తారు. అవినీతిపరులు జైలుకేనంటూ డైరెక్టుగా సంకేతాలు కూడా ఇచ్చేశారు. అవినీతిపరులను శిక్షించాలా.. వద్దా..? మీరే చెప్పడం అంటూ ప్రజలనే ప్రశ్నించారు ప్రధాని. ఇలా ఒకట్రెండు కాదు కేసీఆర్ సర్కార్ గురించి ఎన్నిరోజులుగా మాట్లాడాలని మోదీ మనసులో పెట్టుకున్నారో కానీ ఫరేడ్ గ్రౌండ్ వేదికగా మొత్తం కక్కేశారు.

ఈ స్కెచ్ మామూలుగా లేదుగా..!

ప్రధానికి హైదరాబాద్‌లో అడుగుపెట్టింది మొదలుకుని తిరుగుపయనం అయ్యేవరకూ ప్రతిచోటా కేసీఆర్‌పై ప్రజల్లో మైనస్ చేయాలని పక్కా స్కెచ్‌తోనే బీజేపీ యత్నించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదెలాగంటే.. మోదీని స్వాగతించడానికి సీఎం కేసీఆర్ అస్సలు రారంటే రారని ముందుగా తెలిసినప్పటికీ.. ఆయన వస్తారని శాలువా తీసుకురావడం, సీఎంను సన్మానించాలని బీజేపీ అనుకోవడం.. ఇవన్నీ ఒక ఎత్తయితే ఫరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభలో మోదీ సీటు పక్కనే కేసీఆర్ కోసం ప్రత్యేకంగా కుర్చీ వేయడం ఇవన్నీ జనాల్లోకి తీసుకెళ్లి కేంద్రం అంటే పడకపోవచ్చు కానీ కనీసం అభివృద్ధి పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదనే భావన ప్రజల్లో కలిగించడం కోసం విశ్వప్రయత్నాలన్నీ చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయట. అయితే దీనికి కౌంటర్ ఎలా ప్లాన్ చేయాలో తెలియక బీఆర్ఎస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట.

రియాక్షన్ ఎప్పుడో..!

ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కానీ.. రాష్ట్రంలోని కమలనాథులు ఎవరేం మాట్లాడినా గంటల వ్యవధిలోనే ప్రెస్‌మీట్ పెట్టి మరీ కేసీఆర్ కౌంటరిచ్చేసేవారు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఇంత జరుగుతున్నా.. మోదీ విమర్శలు గుప్పించినా ‘సార్ ఎందుకు సప్పుడు చేయట్లేదు’ అని సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆలోచనలో పడ్డారట. ఏమున్నా ఇలాంటి ఆరోపణలు, విమర్శలు వచ్చిన 24 గంటల్లోనే కౌంటరిస్తే బాగుంటుందని.. కానీ కేసీఆర్ మాత్రం గంటలు గడిచినా రియాక్ట్ అవ్వకపోవడం గులాబీ శ్రేణులు నొచ్చుకుంటున్నాయట. అయితే ఇన్‌సైడ్‌గా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. రెండు మూడ్రోజుల్లోనే కేసీఆర్ తప్పకుండా ప్రెస్‌మీట్ పెడతారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఒకవేళ ఇది వీలుకాని పక్షంలో ఈనెల చివర్లో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభావేదికగా ప్రధాని మాట్లాడిన ప్రతీమాటకు కేసీఆర్ కౌంటరిస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే బీజేపీ మాత్రం మోదీ మాట్లాడిన మాటలన్నీ అక్షరాలా నిజం కాబట్టే కేసీఆర్ నుంచి స్పందనలేదని చెప్పుకుంటోంది.

మొత్తానికి చూస్తే.. కేసీఆర్ ప్రెస్‌మీట్ కోసం కోట్లాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఎదురుచూపులు చూస్తున్నారు. మరి సార్ ఎప్పుడు మీడియా మైక్ ముందుకొస్తారో.. ఏం మాట్లాడుతారో.. కౌంటర్లు ఎలా ఉంటాయా..? అని ఎంతో ఆత్రంగా బీఆర్ఎస్ శ్రేణులు వేచి చూస్తున్నాయ్. ఏం జరుగుతుందో.. ఎప్పుడు గులాబీ బాస్ ప్రెస్‌మీట్ పెడతారో ఏంటో మరి.

Leave A Reply

Your email address will not be published.