ఢిల్లీలో బిజిబిజీగా కిరణ్ రెడ్డి.. కీలక పదవి ఇవ్వబోతున్నారా..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ తీర్థం పుచ్చుకున్న మరుసటిరోజే ఢిల్లీలో వరుస భేటీలతో బిజిబిజీ అయ్యారు. హస్తినలో బీజేపీ పెద్దలతో కిరణ్ రెడ్డి వరుసగా భేటీ అవుతుండటంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు.. ఏపీ బీజేపీకి ఆయనే ఆశా ‘కిరణ్’ అన్నట్లుగా కమలనాథులు పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇదిగో కిరణ్ రెడ్డికి ఫలానా పదవి ఇవ్వబోతున్నారని మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంపీగా కడప జిల్లాలో కీలకమైన ఓ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేస్తారని కూడా చర్చ నడుస్తోంది. ఇంతకీ ఢిల్లీలో కిరణ్ రెడ్డి ఎవరెవర్ని కలిశారు..? ఎందుకు కలిశారు..? ఆయనకు ఏ పదవి ఇస్తారనే వార్తలొస్తున్నాయ్..? కాషాయ కండువా కప్పుకున్న మరుసటి రోజే కిరణ్ రెడ్డి బిజిబిజీ అయిపోయారు. హస్తిన వేదికగా బీజేపీ పెద్దలతో వరుస భేటీలవుతూ దేశ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ అయ్యారు. మొదట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కిరణ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఏపీ రాజకీయాలపై, ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాలపై నిశితంగా చర్చించారని సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాజకీయాలపైనా ఈ భేటీలో చర్చించినట్లు తెలియవచ్చింది. కర్ణాటక ఎన్నికల్లో పనిచేసే అంశాల మీద కూడా కిరణ్‌తో అమిత్ షా, బీఎల్ సంతోష్ చర్చించినట్లు లీకులు వస్తున్నాయి. అనంతరం మాజీ సీఎం యడియూరప్పతో రాజకీయ పరిస్థితులపై కిరణ్ చర్చించారు. కన్నడ నాట త్వరలోనే ఎన్నికలు కూడా ఉండటంతో దీనిపై చర్చకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పార్టీలో చేరిన సాయంత్రమే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యారు. నిన్న, ఇవాళ ఇలా వరుస భేటీలతోనే కిరణ్ రెడ్డి బిజిబిజీగా గడుపుతున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లోనే ఆయనకు కీలక బాధ్యతలు కూడా కట్టబెట్టబోతున్నారని కూడా చర్చ నడుస్తోంది. మరోవైపు కర్ణాటకలో తెలుగు మూలాలు ఉన్న నియోజకవర్గాల్లో కిరణ్‌తో ఎన్నికల ప్రచారం కూడా చేయించాలని బీజేపీ భావిస్తోందట. అంటే ప్రస్తుతానికి కిరణ్ సేవలను ప్రచారానికి బీజేపీ ఉపయోగించుకోనుందన్న మాట.

ఏమిటా పదవి.. ?

రాజకీయంగా అపార అనుభవం ఉన్న కిరణ్‌కు కీలక పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. త్వరలోనే జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు హస్తినలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో  పాటు కర్ణాటక ఎన్నికల్లోనూ కిరణ్‌కు బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయించాలని కమలనాథులు భావిస్తున్నారట. అది కూడా కడప జిల్లాలో కీలక పార్లమెంట్ స్థానమైన రాజంపేట నుంచి బరిలో దింపాలని పెద్దలు అనుకుంటున్నారట. అయితే కిరణ్ రెడ్డికి కూడా ఇదే ఆలోచన ఉందట. అమిత్ షాతో భేటీలో భాగంగా కిరణ్‌కు పలు సూచనలు, సలహాలు అందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలతో టచ్‌లోకి వెళ్లాలని కిరణ్‌కు షా సూచించినట్లుగా సమాచారం. ఈ వార్తలతో నల్లారి అభిమానులు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభినందనలు కూడా చెబుతున్నారు. ఈయనకు పదవి ఇస్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుకు కూడా ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో మార్పులు కచ్చితంగా ఉంటాయని.. సమాలోచనలు చేసిన తర్వాత అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.మొత్తానికి చూస్తే.. ఢిల్లీలో జరిగిన ఈ వరుస భేటీలతో కిరణ్ రెడ్డికి త్వరలోనే శుభవార్తే ఉంటుందని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఆ వార్త ఎప్పుడు ఉంటుంది..? ఇంతకీ కమలనాథుల నుంచి వచ్చే ఆ పదవేంటో.. ఎంపీగా పోటీచేయడంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.