ఎండ దెబ్బకు పగిలిన కొండ బరువు ఎంతో చెప్పిన అధికారులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్నూల్ జిల్లా గోనెగండ్లలోని ఎస్సీకాలనీలో ఎండల దెబ్బకు పగిలిపోయిన నర్సప్ప కొండ రాయికి అధికారులు కొలతలు వేశారు. కొండరాయి ఆరువేల టన్నుల బరువు, 50 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పు ఉందని అంచనా వేశారు. ఈ కొండ రాయి 500 ఏళ్ల నాటిదని నిర్ధారించారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే తొలగింపు పనులు మొదలుపెట్టనున్నారు.రెండు రోజుల క్రితం నర్సప్ప కొండరాయి ఎండ ధాటికి బాంబు పేలిన విధంగా శబ్ధం చేస్తూ పగిలింది. ఆ ప్రాంతంలో బహిర్భూమికి వచ్చిన కాలనీ వాసులు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు. ఆ తరువాత కొండ పగిలినట్లు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం కొండకు వచ్చిన క్రాక్స్ క్రమం క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొండ క్రాక్స్ ఏమేరకు పెరుగుతుందనే దానిపై రెవెన్యూ అధికారులు దృష్టిపెట్టారు. కొండను టెక్నికల్ తొలగిస్తేనే ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు అంచనాకి వచ్చారు. కొండ పక్కనే ఉన్న ఇళ్ల వైపు వాలినట్లు ఉన్న నేపథ్యంలో కొంచెం కదిలించినా ఇళ్లపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇళ్ళ మీద పడే అవకాశం ఉండడంతో ఎస్సీ కాలనీని అధికారులు డేంజర్ జోన్‌గా ప్రకటించారు. కొండ రాళ్ళు పగిలిన ప్రదేశం చుట్టూ ఉన్న 50 ఇళ్లను ఖాళీ చేయించి వారికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ కాలనీవాసులకు గత రాత్రి పునరావాసం కల్పించారు. అయితే ప్రమాదకరంగా ఉన్న బండ రాయిని త్వరగా తొలగించాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా… కొండరాళ్ల మధ్య పగుళ్లను సిమెంట్‌తో పూడ్చివేసి.. ఏటవాలుగా వాలిన కొండరాయికి కింది భాగంలో 12 అడుగుల వరకు ఐరన్ పోల్స్ సపోర్టుగా ఉంచి… ఖాళీ ప్రదేశంలో కాంక్రీట్ బెడ్‌తో పూడ్చాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. కొండ పూడ్చే పనులపై ఉన్నతాధికారుల దృష్టికి ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తీసుకెళ్లారు. ఈరోజు సాయంత్రానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని.. అనుమతులు రాగానే పనులు మొదలుపెడతామని ఆదోని సబ్‌కలెక్టర్ తెలిపారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా కొండను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.