బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/యానాం: ఓ ప్రైవేటు బ్యాంకులో సాయిరత్న శ్రీకాంత్‌ మేనేజర్‌‌గా పనిచేస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. శ్రీకాంత్ భార్య గాయత్రి మంగళవారం ఉదయం పిల్లలను స్కూలుకు తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చారు. భార్య ఎన్నిసార్లు తలుపుకొట్టినా ఆయన తెరవకపోవడంతో కిటకీలోంచి చూశారు.  శ్రీకాంత్‌ ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాకయ్యారు. వెంటనే స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి.. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. అప్పటివరకు వారితో గడిపిన శ్రీకాంత్‌.. తర్వాత ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకోవడం ఆమెను కలిచివేసింది.  ఈ ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తే.. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రీకాంత్‌ యానాంకు రాకముందు మూడేళ్లపాటు మచిలీపట్నం బ్రాంచిలో మేనేజరుగా పనిచేశారు. అప్పుడు బ్యాంక్ టార్గెట్స్ మేరకు రుణాలు ఇచ్చారు. కానీ అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోవడంతో శ్రీకాంత్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో బయట అప్పుచేసి రూ. 60 లక్షల వరకు శ్రీకాంతే చెల్లించినట్లు చెబుతున్నారు.  కొద్ది రోజుల తర్వాత శ్రీకాంత్ యానాంకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఈ బ్రాంచ్‌లో కూడా మరో రూ. 37 లక్షల వరకు అప్పులు చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆయనపై ఒత్తిడి పెరిగిందని భార్య గాయత్రి అంటున్నారు. అయితే ఈ అప్పులు త్వరలో తీరిపోతాయని గత రాత్రే ఎంతో ఆనందంగా చెప్పారని.. ఇంతలోనే ఇలా ప్రాణాలు తీసుకుంటాడని ఊహించలేదన్నారు. బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాలు రికవరీ కాకపోవడంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు పెరిగాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.