సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచి పరి పాలన కొనసాగింపు          

-  ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. రూ.4,361 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణం జరగనుంది. అలాగే ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్.. హిరమండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విశాఖలో సెప్టెంబర్ నుంచి కాపురం పెడతామన్నారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేస్తామన్నారు.విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామని జగన్ వెల్లడించారు. వికేంద్రీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే తన తపన అని జగన్‌ చెప్పుకొచ్చారు. పెత్తందార్లకు, పేదల పక్షాన ఉన్నవారికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఇంకా జగన్ మాట్లాడుతూ.. ‘‘మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. మిగతా వారందరూ ఏకమవుతున్నారు. అందరూ ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నారు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మూలపేట పోర్టు అభివృద్ధికి మూలస్తంభం. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం ముఖచిత్రం మారుతుంది. మూలపేట పోర్టు 100 బిలియన్ల సామర్థ్యానికి చేరుతుంది. మూలపేట పోర్టుతో 35 వేల మందికి ఉపాధి అవకాశం ఉంది. మూలపేట పోర్టుతో మరో 2 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.