సూర్య గ్రహణం భారత దేశంలో కనిపించదు

- ఐనా ఇది చాలా ప్రత్యేకమైనది - శాస్త్రవేత్తలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గురువారం సంభవించిన సూర్య గ్రహణం చాలా ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రెండు రకాల గ్రహణాలు ఒకేసారి కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. ఇది ఆస్ట్రేలియా, కొన్ని ఆగ్నేయాసియా దేశాల్లో కనిపిస్తుంది. ఇది భారత దేశంలో కనిపించకపోయినప్పటికీ, దీనిని ఆన్‌లైన్‌లో చూడవచ్చు.

ఈ హైబ్రిడ్ సూర్య గ్రహణానికి నింగలూ గ్రహణమని పేరు పెట్టారు. దీనిని పశ్చిమ ఆస్ట్రేలియాలో చూడవచ్చు. గురువారం (ఏప్రిల్ 20న) చంద్రుని ఛాయ ఆస్ట్రేలియా అంచులో 40 కిలోమీటర్ల విస్తృతితో ఉండే మార్గంలో పడుతుంది. ప్రపంచంలో అత్యంత సుందరమైన ప్రాంతాల్లో ఒకదాని గుండా ఈ మార్గం ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఒకటైన నింగలూ తీరంలో ఈ మార్గం ఉంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని సుదూర ప్రాంతంలో ఉన్న ఎక్స్‌మౌత్ తీరంలో ఇది ఉంది.నింగలూ ప్రాంతం గుండా ఈ గ్రహణం కనిపిస్తుండటంతో దీనికి నింగలూ గ్రహణం అని పేరు పెట్టారు. ఇది హైబ్రిడ్ సూర్య గ్రహణం. దీనిని యాన్యులార్-టోటల్ ఎక్లిప్స్ (వృత్తాకారంలో-సంపూర్ణంగా ఉండే గ్రహణం) అని కూడా అంటారు. ఈ పేరు ఎందుకు పెట్టారంటే, పరిశీలకులు చూసినపుడు, ఈ గ్రహణం వృత్తాకారంతో మొదలై, సంపూర్ణంగా ఉంటుంది. లేదా, సంపూర్ణ గ్రహణం నుంచి వృత్తాకారంలో ఉంగరం మాదిరిగా ఉంటుంది.

సూర్యుడు, భూమి మధ్యకు చంద్రుడు వచ్చినపుడు, భూమిపై నీడ పడుతుంది. దీనిని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. సూర్యుడి అంచులు కనిపిస్తూ, చంద్రుని చుట్టూ వృత్తాకారంలో ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. దీనిని యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్ అంటారు.

ఏప్రిల్ 20న సంభవించే సూర్య గ్రహణం కనిపించని దేశాల ప్రజలు ఆన్‌లైన్‌లో ఈ గ్రహణాన్ని చూడవచ్చు. timeanddate.com అనే యూట్యూబ్ చానల్‌లో దీనిని వీక్షించవచ్చు. ఆస్ట్రేలియా లోని పెర్త్ అబ్జర్వేటరీ సహకారంతో ఈ చానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 20 సాయంత్రం 7.04 గంటల నుంచి ఈ సూర్య గ్రహణంలో పాక్షిక దశను చూడవచ్చు. ఈ గ్రహణంలో పూర్తి దశ రాత్రి 8.07 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 9.46 గంటల ప్రాంతంలో సూర్యుని ప్రకాశవంతమైన భాగం మొత్తం కనిపించకుండా పోతుంది. ఈ గ్రహణంలో సంపూర్ణ దశ రాత్రి 11.26 గంటల ప్రాంతంలో ముగుస్తుంది. దీనిలో పాక్షిక దశ ఏప్రిల్ 21న రాత్రి 12.29 గంటలకు ముగుస్తుంది.

పదేళ్లకోసారి

ఈ సూర్య గ్రహణం హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్ మహా సముద్రం వరకు కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చంద్రుని చుట్టూ ఉంగరం మాదిరిగా సూర్యుడు కనిపిస్తాడు. మరికొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. అందువల్ల దీనిని హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ అని అంటున్నారు.

2013 నవంబరులో ఇటువంటి సూర్య గ్రహణం కనిపించింది. ఏప్రిల్ 20 తర్వాత ఇటువంటి గ్రహణం మళ్లీ 2031 నవంబరులో సంభవిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.