వివేకానందరెడ్డి హత్యకేసులో రోజుకో కొత్త కోణం

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఓ వైపు సీబీఐ విచారణ మరోవైపు కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుండగా మరో కొత్తకోణం వెలుగు చూసింది. సడన్‌గా హైదరాబాద్‌లోని కోఠి సీబీఐ కార్యాలయంలో వైఎస్ సునీత రెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ వరుసగా నాలుగవ రోజు ముగిసింది. ఈ విచారణ అనంతరం రాజశేఖర్ రెడ్డి సీబీఐ ఆఫీసుకు వచ్చి ఆధికారులతో భేటీ అయ్యారు. అయితే.. వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్‌ వెలుగులోకి రావడం.. రాజశేఖర్ రెడ్డి ఆఫీసులో ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. కాగా.. రాజశేఖర్ రెడ్డితో పాటు అతని సోదరుడిపై షమీమ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. అనేకసార్లు తనను హెచ్చరించి బెదిరింపులకు పాల్పడ్డారని షమీమ్ సీబీఐకి స్టేట్మెంట్ఇచ్చారు. ఈ పరిణామాల తర్వాత రాజశేఖర్ రెడ్డి సీబీఐ ఆఫీసులో ప్రత్యక్షమవ్వడంతో అసలేం జరుగుతోందని జనాలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇంతకీ షమీమ్ ఏమన్నారు..?

‘వివేకానందరెడ్డితో నాకు రెండుసార్లు పెళ్లి జరిగింది. మా పెళ్లి వివేకా ఫ్యామిలీకి ఇష్టం లేదు. శివప్రకాష్‌రెడ్డి నన్ను, మా కుటుంబీకులను చాలాసార్లు బెదిరించారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతారెడ్డి హెచ్చరించారు. నా కొడుకు పేరు మీద భూమి కొనాలని వివేకా అనుకున్నారు. భూమి కొనకుండా వివేకాను శివప్రకాష్‌రెడ్డి అడ్డుకున్నారు. వివేకా ఆస్తిపై రాజశేఖర్‌రెడ్డికి, పదవిపై శివప్రకాష్‌రెడ్డికి వ్యామోహం ఉంది. వివేకాను కుటుంబ సభ్యులే దూరం పెట్టారు. చెక్ పవర్ తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా నాతో మాట్లాడారు. బెంగళూరు ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌తో రూ.8 కోట్లు వస్తాయన్నారు. వివేకా చనిపోతే శివప్రకాష్‌రెడ్డిపై భయంతో వెళ్లలేకపోయాను’ అని సీబీఐకి వివేకా రెండో భార్య షమీమ్ ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. అయితే.. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా తనతో మాట్లాడారని చెప్పిన షమీమ్ చెప్పారే కానీ.. ఏం మాట్లాడారనే విషయాన్ని మాత్రం వాంగ్మూలంలో వెల్లడించకపోవడం గమనార్హం.

ఈ టైమ్‌లోనే ఎందుకు..?

కాగా.. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన వివేకా హత్య కేసు సీబీఐ విచారణలో ఇంకెన్ని ఆసక్తికర మలుపులతో సాగుతుందోననే చర్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు.. వివేకా కేసు విచారణను ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో.. సీబీఐ కూడా విచారణను వేగవంతం చేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం మొదలుకుని ఇటీవల వివేకా హత్య కేసు విచారణలో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇవాళ సీబీఐ విచారణకు అవినాశ్‌రెడ్డి హాజరుకాలేదు. సీబీఐ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అవినాశ్‌రెడ్డి చెబుతున్నారు. సోమవారం సుప్రీంకోర్టు విచారణ తర్వాత అవినాశ్‌ హాజరుపై సీబీఐ నిర్ణయం తెలపనున్నది. ఇలా ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటూ ఉండగా.. సరిగ్గా ఈ టైమ్‌లోనే రాజశేఖర్ రెడ్డి సడన్‌గా ఇలా సీబీఐ ఆఫీసులో ప్రత్యక్షమవ్వడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది

 

Leave A Reply

Your email address will not be published.