మీరు సెల్ వాదుతున్నారా.. ఈ పద్దతులకు స్వస్తి పలకండి

-  తప్పుడు భంగిమల కారణంగా అనారోగ్య సమస్యలు తప్పవు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చేతిలో సెల్ లేకుండా నిమిషం గడిచే పరిస్థితి ఉందా? తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ పక్కన పెట్టేస్తే ఏమేం మెసేజ్ లు వస్తున్నాయో? ఎవరెవరు కాల్ చేస్తున్నారో? అన్న సందేహాలతో టెన్షన్ పడుతూ. ఎప్పుడు చేతికి మళ్లీ ఫోన్ వస్తుందన్న ఆందోళనకు గురయ్యే వారెందరో. అంతలా సెల్ ఫోన్ మీద ఆధారపడిపోయాయి మన బతుకులు. సర్వకాలాల్లో సర్వావస్థల్లో సెల్ ఫోన్ లేని జీవితాన్ని సెకన్ కూడా ఊహించలేమని చెప్పేటోళ్లు ఎక్కువైన ఈ రోజుల్లో ఈ మాయదారి మొబైల్ ఫోన్ చేసే నష్టం. దానితో వచ్చే కష్టం ఎంత ఎక్కువన్న విషయాన్ని తాజాగా వెల్లడైన ఒక నివేదిక స్పష్టం చేస్తోంది.కూర్చున్నా నిలుచున్నా నడుస్తున్నా పడుకున్నా సందర్భం ఏదైనా సెల్ ఫోన్ వాడేస్తున్న కారణంగా ఆరోగ్యానికి ఎంతో నష్టం వాటిల్లుతోంది. శారీరకంగా కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. సెల్ వాడకం ఎక్కువగా వాడేసే టీనేజర్లు టెక్ నెస్ (న్యూ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్)తో బాధ పడుతున్నారు. దీని కారణంగా మెడ వెన్నునొప్పితో పాటు తలనొప్పి భుజాల నొప్పులు చేతుల్లో జలదరింపు కండరాలు పటుత్వాన్ని కోల్పోవటం లాంటి సమస్యల్ని వారు ఎదుర్కొంటున్నట్లుగా తాజా అధ్యయనం వెల్లడించింది.

సెల్ వాడే వేళలో మెడను అతిగా వంచేయటం తెలిసిందే. దీని కారణంగా మెడలోని స్నాయువులు కండరాలు.. కీళ్ల పై ఒత్తిడి పడుతోందని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఛబ్రా వార్నింగ్ ఇస్తున్నారు. అదే పనిగా సెల్ ను అధికంగా వినియోగిస్తున్న కారణంగా మెడ కండరాలు అపసవ్యంగా సంకోచించటం వల్ల పుర్రెతో అనుసంధానమైన చోటు మంట నొప్పి కలిగిస్తుందని చెప్పారు.ఈ నొప్పి ఫాసియా ద్వారా మెడ నుంచి తలకు వ్యాపిస్తోందన్నారు. మొబైల్ వాడే వేళలో వేళ్లు మాత్రమే వాడతామని చాలా మంది అనుకోవచ్చు కానీ. చేతులు మోచేయి కండరం మెడ ఇవన్నీ వినియోగిస్తున్న విషయాన్ని చాలామంది గుర్తించరు. మొబైల్ వాడే వేళలో మెడను కిందకు వంచుతాం. దీంతో మెడ.. వెన్నుముక పై ఒత్తిడి పడుతుంది. దీంతో మెడ వంచి చూసే భంగిమతో వెన్నముక పై తల బరువు పెరుగుతుందని పేర్కొన్నారు. అదెలానో లెక్కల్లో చెప్పుకొచ్చారు.
తల నిటారుగా ఉన్న స్థితిలో దాదాపు 5-8 కేజీల బరువు పుడుతుంది. తల వంగుతున్నప్పుడు 15 డిగ్రీల వద్ద మెడ మీద భారం సుమారు 12 కేజీలు 30 డిగ్రీల వద్ద 18.14 కేజీలకు 45 డిగ్రీల వద్ద 22.23 కేజీలు 60 డిగ్రీల వద్ద 27.22 కేజీల భారం పడుతుంది. ఇలా మెడ అతిగా వంగడంతో వెన్నుముక సపోర్టింగ్ లిగమెంట్లు. కండరాల పై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఫోన్ మాట్లాడే వేళలో నిలబడి.. కూర్చునే భంగిమలోని లోపాలతో మస్క్యులోస్కెలెటల్ సమస్యకు కారణమవుతుందని .. గర్భాశయ.. థొరాసిక్ నడుము ప్రాంతాల్లో వెన్నుముక దెబ్బ తినటంతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు.కీళ్లు బాగా పని చేసే వేళలో అవి ఒత్తిడికి గురైనా.. రెస్టు తీసుకునే వేళలో తమను తాము రిపేర్ చేసుకుంటాయని. కానీ కీళ్లు అసాధారణ రీతిలో ఒకే భంగిమలో ఎక్కువ సేపు ఉండటం కారణంగా. తీవ్రమైన పని ఒత్తిడి అరిగిపోయి. తిరిగి బాగయ్యే ఛాన్సు లేనంతగా దెబ్బ తింటాయని పేర్కొన్నారు. ట్రెడ్ మిల్ క్రాస్ ట్రైనర్ వంటి వాటి మీద ఉండే వేళలో మొబైల్ ను అస్సలు వాడొద్దంటున్నారు. మొబైల్ వాడే వేళలో మన భంగిమ ఎలా ఉందన్న విషయంపై మరింత శ్రద్ధ అవసరమంటున్నారు.నిలబడి ఉన్నప్పుడు మెసేజ్ లు పంపుతున్నప్పుడు తలపైకి భుజాలు కిందకు ఉంచాలని. వీలైనంత వరకు మొబైల్ను కళ్లకు సమాంతరంగా ఉంచటమే సరైన భంగిమగా చెబుతున్నారు. కుర్చీ లేదంటే సోఫాలో కూర్చున్న వేళలో వెన్నును నిటారుగా ఉంచి కూర్చోవాలని సూచిస్తున్నారు. సెల్ వాడే వేళ మెసేజ్ పంపే వేళలో మెడ ఎక్కువ సేపు వంచొద్దని చెబుతున్నారు. ఒకవైపు ఏదో పని చేస్తూ మరో వైపు ఫోన్ వాడే మల్టీ టాస్కింగ్ అస్సలు మంచిది కాదంటున్నారు. భోజనం చేస్తూ టీవీ చూస్తే కంప్యూటర్ వినియోగిస్తూ. డ్రైవ్ చేస్తూ చాలా ఈజీగా ఫోన్ వాడేస్తుంటారని కానీ ఇదే మాత్రం మంచిది కాదంటున్నారు.సెల్ అతిగా వాడటం మన కదలికలు.. భంగిమ మీద పెద్దగా శ్రద్ధ చూపని వారు తప్పుడు భంగిమల కారణంగా అరవై డెబ్భై ఏళ్లలో ఎదురుకావాల్సిన ఆరోగ్య సమస్యలు.. మెడ  సాగటం.. ఫ్రోజెన్ షోల్డర్.. రౌండెడ్ షోల్డర్ లాంటివి నలభై ఏళ్లకే వచ్చేస్తున్నాయి. వాష్ రూమ్స్.. టాయిలెట్లలో మొబైల్ అధికంగా వాడొద్దని.. ఆ వేళలో వాడటం వల్ల భుజాల కండరాలు.. చేతులు.. మణికట్టు మీద తీవ్రమైన ఒత్తిడి పడతాయని చెబుతున్నారు. సో.. మొత్తంగా సెల్ ఫోన్ ను వాడటం తగ్గించటం.. వాడే వేళలో సరైన భంగిమలో వాడటం తప్పనిసరి అన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు.

Leave A Reply

Your email address will not be published.