అనంతపురం జిల్లా వైసీపీలో రెండు వర్గాల మధ్య వర్గపోరు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లాలోని శింగనమల వైసీపీలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన వర్గపోరు ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార పార్టీ సభ్యులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఉపాధి పనుల విషయంలో ఈ గొడవ చోటుచేసుకుంది. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం దంతలపల్లిలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, బోగాతి నారాయణరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఉపాధి పనుల విషయంలో దంతలపల్లి వైసీపీలోని రెండు వర్గాలు వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు బాల వెంకటరెడ్డి, బోగాతి నారాయణరెడ్డి వర్గీయుడు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణపై ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. విషయం తెలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి యల్లనూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యల్లనూరు మండలంలో కొంతమంది నాయకుల స్వార్థ ప్రయోజనాలు కోసం గ్రామాల్లో కక్ష్యలు రేపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆటవిక రాజ్యం నడుస్తుందని… పుట్లూరు,యల్లనూరు మండలాలతో సంబంధాలు ఉన్నప్పటికీ జోక్యం చేసుకోవడం లేదని విమర్శించారు. అయినప్పటికీ వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని… రాజకీయాలు శాశ్వతం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లు, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో నియంతల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదన్నారు. దళిత మహిళ ఎంపీపీ అయినా కనీసం గౌరవించడం లేదని తెలిపారు. దంతలపల్లిలో ఫ్యాక్షన్ ప్రారంభమైతే కడప జిల్లా లింగాల, సింహాద్రిపురం మండలాలకు ఫ్యాక్షన్ చేరుతుందని కేతిరెడ్డి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారు

Leave A Reply

Your email address will not be published.