యుగానికో రాక్షసుడు పుడతాడంటూ జగన్ పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యుగానికో రాక్షసుడు పుడతాడంటూ జగన్ గురించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. యుగానికో రాక్షసుడు పుడతాడని.. జగన్ అలాగే పుట్టారని అన్నారు. ‘‘తల్లి అంటే ప్రేమ లేదు.. చెల్లి అంటే ప్రేమ లేదు.. ఓ బాబాయిని చంపించాడు.. మరో బాబాయిని జైలుకు పంపాడు. ఏమన్నా అంటే బటన్ నొక్కానంటున్నారు. ప్రత్యేకంగా ఎస్సీల కోసం ఒక్క బటన్ అయినా నొక్కారా..?. జగన్ ఇక్కడితో ఆగడు.. తన ఇంట్లోనే ఏదోకటి చేసుకుని.. మన మీదే ఆ నెపం నెట్టే ప్రయత్నం చేస్తారు’’ అని మండిపడ్డారు. జగన్ దళిత ద్రోహి అని ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత టీడీపీ ఎస్సీ నేతలదే అని తెలిపారు. జగన్ ఏదో నవరత్నాలు అమలు చేస్తారట.. జగన్‌వి నవరత్నాలు కావు నవమోసాలు అంటూ ఆయన విరుచుకుపడ్డారు.

 ‘‘గడప గడపకు వెళ్లాలన్నాడు.. స్టిక్కర్ వేయమంటున్నాడు. జగన్ ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపుల మీద కాదు.. పోలీస్ స్టేషనులో జగన్ ఫొటో ఉండాలి. యర్రగొండపాలెంలో మనపైనే దాడి చేసి.. మనకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనుకున్నారు’’ మండిపడ్డారు. జగన్ కోడి కత్తి డ్రామా ఆడారన్నారు. జగన్ కళ్లల్లో ఆనందం చూడడానికి కత్తితో పొడిచానని.. కోడికత్తి శీనునే చెప్పాడని తెలిపారు. కోడికత్తి శీనును ఐదేళ్లుగా జైల్లో మగ్గేలా చేస్తున్నారని.. ఏ మాత్రం అవకాశం ఉన్నా కోడికత్తి శీనును కూడా చంపేస్తారేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. సలహాదారులుగా దళితులను ఎందుకు నియమించలేదు.. వారికి అర్హత లేదని జగన్ భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. వైస్ ఛాన్సలర్లుగా దళితులు పనికి రారా అంటూ నిలదీశారు. ‘‘యర్రగొండపాలెంలో నేనేమన్నాను…?. గతంలో వ్యవసాయం దండగ అన్నానని దుష్ప్రచారం చేసినట్టే.. ఇప్పుడు నేనేదో దళితులను విమర్శించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ జగన్ను తిడితే.. ఎస్సీలను తిట్టినట్టుగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారుఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దళిత ద్రోహి జగన్ అనే విషయాన్ని బలంగా చెప్పాలి. మంత్రి సురేష్ బట్టలిప్పేసి.. రోడ్ మీదకు వచ్చి వీరంగం వేశారు. అసలు బట్టలిప్పాల్సిన అవసరమేంటీ..?. నా మీద దాడి చేస్తే.. ఎన్ఎస్జీ కమాండోలతో కాల్పులు జరిగేలా ప్లాన్ చేశారు. ఇలాంటి పనులు చేసేవాడు ఓ మనిషా..? జగన్ సైకో’’ అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Leave A Reply

Your email address will not be published.