మహిళా ప్రయాణికురాలి లగేజ్‌ బ్యాగుల్లో 22 పాములు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఒక మహిళా ప్రయాణికురాలి లగేజ్‌ బ్యాగుల్లో 22 పాములు ఒక ఊసరవెల్లి ఉన్నాయి. వీటిని చూసి కస్టమ్స్‌ అధికారులు షాక్‌ అయ్యారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 28న ఒక మహిళ మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఏకే13 విమానంలో తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. ఆ మహిళపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజ్‌ను తనిఖీ చేశారు. ఆ మహిళకు చెందిన బ్యాగుల్లో పలు జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి కనిపించాయి. వీటిని చూసి కస్టమ్స్‌ అధికారులు ఖంగు తిన్నారు. పాములు పట్టే వారిని రప్పించి ఆ పాములను స్వాధీనం చేసుకున్నారు.కాగా, ఆ మహిళపై కస్టమ్స్‌ యాక్ట్‌తోపాటు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసిన ఆ మహిళను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు కస్టడీ విధించడంతో రిమాండ్‌ నిమిత్తం జైలుకు తరలించారు. ఆ పాములు, ఊసరవెల్లిని అక్రమంగా ఎవరికి రవాణా చేస్తున్నారో అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ మహిళ బ్యాగుల నుంచి బయటపడిన పాముల వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా షాక్‌ అయ్యారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.