ముమ్మరంగా సాగుతోన్నసుడాన్‌ భార‌తీయుల త‌ర‌లింపు ప్రక్రియ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సుడాన్‌ లో చిక్కుకున్న భార‌తీయుల త‌ర‌లింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కావేరి’ తో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తోన్న విషయం తెలిసిందే. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వాయుసేన ద్వారా ఇప్పటి వరకు 1,400 మంది సురక్షితంగా స్వదేశానికి చేరారు.సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణతో అతలాకుతలమైన సూడాన్ నుంచి ‘ఆపరేషన్ కావేరి’ ద్వారా కేంద్రం భారతీయుల్ని స్వదేశానికి రప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1,400 మందిని సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు భారత వాయు సేన తాజాగా వెల్లడించింది. రెండు సీ-130 జే విమానాల ద్వారా 260 మందిని తీసుకొచ్చినట్లు ఐఏఎఫ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. వీరిలో 90 ఏండ్లు పైబడిన వారు ఉన్నట్లు పేర్కొంది. ఒకరి వయసు 102 ఏండ్లని వివరించింది.కాగా, ఆపరేషన్‌ కావేరీలో భాగంగా.. సోమవారం ఉదయం 186 మంది భారతీయులు సుడాన్‌ నుంచి కొచ్చి చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సుడాన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతుందని చెప్పారు. కాగా, ప్రభుత్వ వివరాల ప్రకారం.. సుడాన్‌లో 3,500 మంది భారతీయులు, 1000 మంది భారత సంతతి వ్యక్తులు చిక్కుకున్నారు. ‘ఆపరేషన్‌ కావేరి’లో భాగంగా ఇప్పటి వరకు స్వదేశానికి చేరుకున్నవారి సంఖ్య 2,500 దాటింది.

Leave A Reply

Your email address will not be published.