ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీ నామా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పవార్ మీడియా సమావేశంలో తెలిపారు. ‘‘నేను ఎన్సీపీ అధ్యక్ష పదవిను వైదొలగుతున్నాను’’ అని శరద్ పవార్ ప్రకటన చేశారు. దీంతో కార్యకర్తలు శరద్ పవార్ మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. శరద్ పవార్ రాజీనామాతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి మాత్రమే వైదొలగుతున్నానని..రాజకీయాల నుంచి తప్పుకోవడంలేదని పవార్ స్పష్టం చేశారు. ‘‘నేను ప్రజాజీవితం నుంచి రిటైర్ అవడంలేదు..ఎన్సీపీ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని’’ శరద్ పవార్ అన్నారు.గత కొంతకాలంగా ఎన్సీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువవయ్యాయని ప్రచారం జరుగుతోంది. శరద్‌పవార్‌ సోదరుడి కుమారుడు అజిత్‌ పవార్‌ పార్టీపై తిరుగుబాటు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో శరద్‌పవార్‌ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. శరద్ పవార్ రాజీనామాతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని.. పవార్‌ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ కార్యకర్తలు కోరుతున్నారు.

1999లో పీఏ సంగ్మా, తారీఖ్ అన్వర్లతో కలిసి శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ స్థాపించారు. రెండు దశాబ్దాలుగా ఎన్సీపీని ముందుండి నడిపిస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఆటోపోటులను ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించారు.మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడి కూటమిలో శరద్‌పవార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయన పార్టీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో ఎంవీఏ కూటమి భవిష్యత్ గందరళగోళంలో పడింది. మరోవైపు బీజేపీపై పోరాటంలో విపక్షాలను ఒకే తాటి మీదకు తెచ్చేందుకు పవార్‌ ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.