కేసీఆర్ ఎన్నికల వరాలు.. అన్నీ ఇన్నీ కావు …

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకుని రికార్డు నమోదు చేయాలని భావిస్తున్న భారత రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్.. దానికి అనుకూలంగా ఇప్పటికే పావులు కదుపుతున్నారు. అసలుఇంకా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనే లేదు. ఇంకా.. షెడ్యూల్ ప్రకటించేందుకు కనీసం నాలుగు మాసాల గడువు కూడా ఉంది.  అయితే.. అనూహ్యంగా కేసీఆర్ మాత్రం ప్రజలపై ఎన్నికల వరాలు ప్రకటించేస్తున్నారు. ఒకరకంగా.. చెప్పాలంటే.. ఎన్నికల జల్లు జోరుగా కురిపిస్తున్నారనే చెప్పాలి.ఇటీవల కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి కీలకనిర్ణయం తీసుకున్నా రు. సుమారు 5 వేల పైచిలుకు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు అనుకూలంగా ఆయన సంతకం పెట్టారు. నిజానికి ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం. పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ప్రభుత్వంలోనే కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు దాని ఊసు ఎత్తనే లేదు. అయితే.. అనూహ్యంగా ఎన్నికల ముందు.. వారిపై వరాల జల్లు కురిపించారు.
ఇక మరో కీలక విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలుపెంచుతూ.. నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ఎన్నికల స్టంటేనని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో మొత్తం 40 వేల పైచిలుకు సంఖ్యలో కార్మికులు ఉన్నారు. వీరిపై ఒకప్పుడు తీవ్రస్తాయిలో ఉక్కుపాదం మోపారు.ముఖ్యంగా జీహెచ్ ఎంసీ పరిదిలో అయితే.. వేతనాలు పెంచాలన్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాంటి పరిస్తితి నుంచి నేడు.. వారికి వేతనాలు పెంచే పరిస్థితి కి వచ్చారు అంటే.. ఇది ఖచ్చితంగా ఎన్నికల వ్యూహమేనన్నది మేధావుల మాట.
మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేసే ఫైలుపైనా సీఎం కేసీఆర్ తాజాగా సంతకం చేశారు. వాస్తవానికి గత ఏడాది హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈ పథకాన్ని తెరమీదికి తెచ్చారు. అప్పటికప్పుడు ఆఘమేఘాలపై ఇక్కడ అమలు చేశారు. అయితే.. తర్వాత.. ఆచి తూచి వ్యవహరించారు.మొత్తానికి ఇప్పుడు మళ్లీ దళిత బంధును పూర్తిస్థాయిలో అన్ని జిల్లాల వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అంటున్నారు పరిశీలకు లు. తాజాగా మద్యం సీసాల ధరలు తగ్గించి.. మందుబాబులపైనా వరాల జల్లు కురిపించారు ఇలా మొత్తంగా చూస్తే.. వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా కేసీఆర్ను గందరగోళానికి గురి చేస్తున్నాయని అందులో భాగంగానే వరాల జల్లు కురిపిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.

Leave A Reply

Your email address will not be published.