న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసినందుకు రూ.10వేల జరిమానా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పరిష్కారమైన సమస్యపై మళ్లీ కోర్టులో కేసు వేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు మందలించింది. అదే విషయంపై పదే పదే కోర్టుకు తీసుకురావడం న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేడయమేనంటూ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సదరు వ్యక్తికి జరిమానాను సైతం విధించింది. ఓ సమస్యను అత్యున్నత స్థాయిలో పరిష్కరించిన తర్వాత మళ్లీ మళ్లీ లేవనెత్తే దృశ్యం న్యాయవ్యవస్థలో ఉండదని కోర్టు పేర్కొంది. దాంతో న్యాయ వ్యవస్థ సమయం వృథా అవుతుందని పేర్కొంది.ఓ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించగా.. దీనిపై సుప్రీంకోర్టు విచారించి.. 2004 కేసును ముగించింది. అయితే, తనకు అన్యాయం జరిగిందని, దీనిపై మళ్లీ విచారణ జరుపాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ప్రకారం.. తనకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ పిటిషనర్‌ రిట్‌ పిటిషన్‌ చేశారు. రాజ్యాంగంలోని 32వ అధికరణం కింద వ్యక్తులు తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిన సమయంలో న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును కల్పించింది.మే 1న జారీ చేసిన ఉత్తర్వులో బెంచ్ ఏ న్యాయ వ్యవస్థలోనూ ఒక వ్యక్తి ఒకే సమస్యను అత్యున్నత స్థాయిలో పలుమార్లు పరిష్కరించే దృశ్యం ఉండదని పేర్కొంది. ఇది న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృధా చేయడమేనని, సమయం వృధా చేసినందుకు జరిమానా విధించడంతో పాటు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తి నిరుద్యోగి కావడంతో ధర్మాసనం రూ.10వేల జరిమానా విధించింది. సంబంధిత మొత్తాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వెల్ఫేర్ ఫండ్‌లో డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.