గుడిపల్లి” కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

గుడిపల్లి” కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు కోసం “గుడిపల్లి మండల సాధన సమితి” ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 73 వ రోజుకు చేరుకున్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పెద్దఅడిశర్లపల్లి మండలానికి చెందిన గుడిపల్లి గ్రామం చారిత్రాత్మకమైనది. గతంలో వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. మండల కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు, హంగులు కలిగి ఉంది. ఈ గ్రామంలో పోలీస్ స్టేషన్, తాలూకా స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్యాంకు, ఉన్నత పాఠశాల, SLBC క్యాంపు, పశు వైద్యశాల, హెడ్ పోస్ట్ ఆఫీస్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, పోలీసు హెడ్ క్వార్టర్స్, వసతి గృహము, గ్రంథాలయము, విద్యుత్ సబ్ స్టేషన్, రోడ్డు రవాణా సౌకర్యాలు, మండల కార్యాలయాలకు సరిపడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నవి. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు పొందిన మేజర్ గ్రామ పంచాయతీ గుడిపల్లి.

1986లో ఆనాటి ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు గారు మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టినపుడు ప్రకటించిన జాబితాలో తొలుత గుడిపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా గెజిట్లో పొందుపరిచి ఎందువల్లనో తర్వాత విరమించడం జరిగినది. ఆనాటి నుండి ఇప్పటివరకు 36 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు గుడిపల్లి మండలం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. పాలకులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని రకాలుగా తమ ఆకాంక్షను వెలుబుచ్చినా ఇప్పటి వరకు తమ కల సాకారం కాలేదు. అప్పటినుండి ఎంతోమంది పరిపాలన చేసినా గుడిపల్లి కేంద్రంగా మండలం ఏర్పాటు చేయలేదు.

గుడిపల్లి మండల కేంద్రంగా నూతన మండల ఏర్పాటు కోసం పెద్ద అడిశర్లపల్లి మండలంలోని 11 గ్రామ పంచాయతీలు, పెద్ద అడిశర్లపల్లి మండల పరిషత్తు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ప్రక్కనే ఉన్న గుర్రంపోడు మండలంలోని 8  గ్రామ పంచాయతీలు చేరడానికి సుముఖంగా ఉన్నాయి. ఈ 19 గ్రామాలతో గుడిపల్లి కేంద్రంగా మండలం ఏర్పరిస్తే పరిపాలనా పరంగా అన్ని గ్రామాలకు అనుకూలంగా ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను, కొత్త మండలాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ క్రమంలోనే మా యందు దయ ఉంచి అన్ని అర్హతలు ఉన్న గుడిపల్లిని కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటుచేసి మా ప్రాంత ప్రజల న్యాయమైన చిరకాల కోరికను నెరవేర్చగలరని ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్బంగా  గుడిపల్లి మండల సాధన సమితి”కి సంఘీభావం తెలుపుతూ “తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం” (TRJKS) ధూమ్ ధామ్ కార్యక్రమం చేపట్టింది.

Leave A Reply

Your email address will not be published.