యోగీతో హిమాచల్ గవర్నర్ ఎస్పీ శుక్లా భేటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా భేటీ అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు వచ్చిన గవర్నర్ ఎస్పీ శుక్లా.. సీఎంకు శాలువాతో పాటు హిమాచల్ టోపీని కూడా బహుకరించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై ఇరువురూ చర్చించారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఓ అవగాహనకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
హిమాచల్ గవర్నర్ శుక్లా రాక సందర్భంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ గురు గోరఖ్ నాథ్ తో పాటు తన గురువు మహంత్ అవైద్యనాథ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ తో కలిసి ఇరు రాష్ట్రాల్లో పరిస్దితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక అంశాల్ని పంచుకునే అంశంపై యోగీ-శుక్లా చర్చించారు. పొరుగు రాష్ట్రాలైన యూపీ, హిమాచల్ లో సారూప్యతలు ఉన్నాయని, వాటి ఆధారంగా సాంసృతిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.

ఈ పర్యటన ముగిశాక హిమాచల్ ప్రదేశ్ రాజ్ భవన్ ట్విట్టర్ లో యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ శుక్లా భేటీకి సంబంధించిన వీడియోల్ని, వివరాల్ని పోస్ట్ చేసింది. ఇందులో గవర్నర్ శుక్లా.. తాను అందరూ బావుండాలని గురు గోరఖ్ నాథ్ ను ప్రార్ధించినట్లు తెలిపారు. యూపీ ప్రభుత్వం కూడా హిమాచల్ ప్రదేశ్ శుక్లా పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. గవర్నర్ తో కలిసి సీఎం యోగీ.. ఈ టూర్ ఆద్యంతం ఉల్లాసంగా గడిపారు. బీజేపీ మాజీ నేత అయిన శుక్లాతో సన్నిహిత సంబంధాలు కలిగిన యోగీ ఆదిత్యనాథ్.. ఈ పర్యటన ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.