కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

- డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే కాంగ్రెస్ హైకమాండ్ పట్టం కట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సీఎంగా సిద్ధరామయ్య పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. గురువారమే (May 18, 2023) సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందింది.

 

డీకే శివకుమార్‌తో కాంగ్రెస్‌ హైకమాండ్‌ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. డీకే శివకుమార్‌కు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బెంగళూరులోని సిద్ధరామయ్య ఇంటి దగ్గర భద్రత పెంచారు. సోనియా, రాహుల్‌తో సిద్ధరామయ్య భేటీ అయిన అనంతరం సిద్ధరామయ్య వైపే హైకమాండ్ మొగ్గు చూపినట్లు జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్‌ హైకమాండ్‌ అనుభవానికే పెద్దపీట వేసింది. సిద్ధరామయ్యకు అనుభవం కలిసొచ్చింది. ఎమ్మెల్యేల మద్దతు కూడా సిద్ధరామయ్యకే ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ మాజీ ముఖ్యమంత్రి వైపే నిలిచింది. డీకే శివకుమార్‌కు పలు కేసులు అడ్డంకిగా మారాయి. డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు డీకే చెప్పిన ఎమ్మెల్యేలకు విద్యుత్, నీటిపారుదల శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సిద్ధరామయ్య పేరు ముఖ్యమంత్రిగా దాదాపుగా ఖరారు కావడంతో బెంగళూరులోని ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది. ఆయన అభిమానులు సిద్ధరామయ్య ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి తమ హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.