నోట్ల రద్దుపై సుప్రీం కోర్టు విచారణ

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతోపాటు ఎందరినో ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన పాత వెయ్యి, రూ.500 నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జస్టిస్ ఎస్‌ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సమీక్షిస్తున్నది. నోట్ల రద్దుపై సమగ్రంగా అఫిడవిట్లు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. ఈ మేరకు బుధవారం నోటీసులు పంపింది. తదుపరి విచారణను నవంబర్‌ 9కి వాయిదా వేసింది.కాగా, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కేంద్ర ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించారు. 1978లో ఆమోదించిన అధిక విలువ కలిగిన బ్యాంకు నోట్ల రద్దు (డిమోనిటైజేషన్) చట్టాన్ని సరైన దృక్కోణంలో సవాల్‌ చేయకపోతే, ఈ సమస్య తప్పనిసరిగా విధానపరమైనదేనని ఆయన అన్నారు.అయితే నోట్ల రద్దు విధానపరమైన నిర్ణయం కాదని ఒక ప్రతివాది తరుఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది, కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం కోర్టుకు తెలిపారు. నోట్ల రద్దు కోసం పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేయాల్సి ఉందన్నారు. అలా జరుగనందున కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు అంశంపై ఉన్నత న్యాయస్థానం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.కాగా, తమ ముందుకు ఒక అంశం వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయపరమైన సమీక్షలో ‘లక్ష్మణరేఖ’ గురించి తమకు తెలుసని బెంచ్‌ వ్యాఖ్యానించింది. 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు కేవలం విధానపరమైన నిర్ణయమా? లేక ఇంకేమైనా అంశాలు ఇమిడి ఉన్నాయా అన్నది పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తులు బీఆర్‌ గవాయి, ఏఎస్‌ బొపన్న, వీ రామసుబ్రమణియన్, వీబీ నాగరత్నతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. నోట్ల రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఈ ధర్మాసనం విచారణ చేపట్టింది.

Leave A Reply

Your email address will not be published.