సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న ఓ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఆయుధాల డీలర్ సంజయ్ భండారీకి సంబంధించిన కేసులో వీరి అసెస్‌మెంట్లను సాధారణ అసెస్‌మెంట్‌కు బదులుగా సెంట్రల్ సర్కిల్‌కు ఆదాయపు పన్ను శాఖ బదిలీ చేయడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంజయ్ గాంధీ స్మారక ట్రస్ట్, జవహర్ భవన్ ట్రస్ట్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, యంగ్ ఇండియన్, ఆమ్ ఆద్మీ పార్టీ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కూడా హైకోర్టు తోసిపుచ్చింది.

సోనియా రాహుల్ ప్రియాంక లకు చెందిన అసెస్‌మెంట్ ఇయర్ 2018-19కి సంబంధించిన కేసులను సెంట్రల్ సర్కిల్‌కు బదిలీ చేస్తూ ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను వీరు సవాల్ చేశారు. సంజయ్ భండారీ కేసులతో తమకు సంబంధం లేదని వాదించారు.జస్టిస్ మన్మోహన్, జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ ధర్మాసనం తీర్పు చెప్తూ, సోనియా, రాహుల్, ప్రియాంకల అసెస్‌మెంట్లను చట్ట ప్రకారమే సెంట్రల్ సర్కిల్‌కు బదిలీ చేశారని తెలిపింది. రిట్ పిటిషన్లను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. సాహచర్యం లేదా బంధుత్వం వల్ల నేరం జరగదనేది నిస్సందేహమేనని తెలిపింది. సమన్వయంతో కూడిన దర్యాప్తు కోసమే ప్రస్తుత కేసుల్లో అసెస్‌మెంట్లను బదిలీ చేశారని తెలిపింది. సెంట్రల్ సర్కిల్ అధికార పరిధి కేవలం సెర్చ్ కేసులకు మాత్రమే పరిమితం కాదని చెప్పింది. రూపం లేని అసెసింగ్ ఆఫీసర్ చేత అసెస్‌మెంట్ చేయించుకునే ప్రాథమిక హక్కు కానీ, చట్టబద్ధ హక్కు కానీ అసెసీలకు లేదని స్పష్టం చేసింది.ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు విభాగానికి అనుబంధంగా సెంట్రల్ సర్కిల్ పని చేస్తుంది. సోదాల్లో సేకరించిన సాక్ష్యాధారాలను సెంట్రల్ సర్కిల్ స్వాధీనం చేసుకుంటుంది. కేసును తార్కిక ముగింపునకు తీసుకొస్తుంది. గాంధీల ఐటీ అసెస్‌మెంట్‌ను సెంట్రల్ సర్కిల్ పూర్తి చేస్తుంది. అవసరమైన పెనాల్టీలను విధిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. పన్ను ఎగవేతకు సంబంధించిన కేసుల్లో ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్‌ను ఇన్వెస్టిగేషన్ వింగ్ ప్రారంభించవచ్చు.

Leave A Reply

Your email address will not be published.