నడిరోడ్డుపై కాలిపోయిన బస్సు.. 21 మంది సజీవ దహనం..

.. మృతుల్లో 12 మంది పిల్లలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాకిస్తాన్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై ఓ బస్సులో మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింధ్ ప్రావిన్స్‌లోని జంషోరో జిల్లా నూరియాబాద్ సమీపంలో మోటార్ వేపై గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు. మృతులంతా వరద బాధితులని.. కరాచీ నుంచి తమ స్వగ్రామానికి వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురయిందని తెలిపారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆగస్టు నెలలో పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తడంతో వరద బాధితులను కరాచీలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితులు కొంత చక్కబడడడంతో వారంతా తిరిగి స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సింధ్ ప్రావిన్స్ ఖైర్‌పూర్‌నాథన్ షా ప్రాంతానికి చెందిన 45 మంది ఏసీ బస్సులో తమ ఇళ్లకు బయలుదేరారు. ఐతే బస్సు నూరియాబాద సమీపానికి చేరుకోగానే.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు మొత్తం వ్యాపించాయి. అందులో ఉన్న వారంతా ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఏసీ బస్సు కావడం.. కిటికీలన్నీ మూసి ఉండడంతో.. చాలా మంది ప్రయాణికులు బయటకు వెళ్లలేకపోయారు. మంటల్లో కాలిపోయి కొందరు.. దట్టమైన పొగతో ఊపిరాడక మరికొందరు మరణించారు.

Leave A Reply

Your email address will not be published.