మునుగోడు కొత్త ఓటర్లలో సగానికి పైగా బోగస్ ఓట్లు

.. ఏరివేతకు అధికారుల చర్యలు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలలోనూ ఆందోళన కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మునుగోడులో బోగస్ ఓట్ల టెన్షన్ పట్టుకుంది. ఇక ఎన్నికల అధికారులు మునుగోడులో కొత్త ఓటర్లపై దృష్టి సారించారు. టీఆర్ఎస్ టార్గెట్ గా బోగస్ ఓటర్లపై మండిపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలని ఇప్పటికే టీఆర్ఎస్ నకిలీ ఓటర్లను సిద్ధం చేస్తోందని బీజేపీ ఆరోపణలు చేస్తుంటే,టీఆర్ఎస్, బీజేపీ కలిసి నకిలీ ఓటర్లను రంగంలోకి దించుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ మునుగోడులో బోగస్ఓట్లను ఏరివేయాలని లేఖ రాసింది. ఇక బీజేపీ నకిలీ ఓటర్ ల విషయంలో హైకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉంటే మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓటర్ల వివాదం ఆసక్తికరంగా మారడంతో ఎన్నికల కమిషన్ మునుగోడులో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లు పెద్దఎత్తున కొత్తగా ఓటు నమోదు చేసుకోవడంతో, వాటిని సునిశితంగా పరిశీలిస్తున్న అధికారులు అనర్హులకు ఓటు తిరస్కరిస్తున్నారు. ఇప్పటి వరకు పదివేలకు పైగా ఓట్లను అధికారులు తొలగించినట్లు గా తెలుస్తుంది. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు చేరడం నియోజకవర్గంలో చర్చనీయాంశం అవుతుంది. ఎన్నికల అధికారులు ఆగస్టు 1వ తేదీ నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు 24,881 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అధికారులు నేరుగా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇళ్లకు వెళ్లి మరీ అక్కడ స్థానికంగా ఉంటున్నారా లేదా అన్నది ఎంక్వయిరీ చేస్తున్నారు. ఇల్లు లేకపోయినా, వారు స్థానికంగా అక్కడ నివాసం ఉండకపోయినా అటువంటి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అర్హులైన వారి దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తున్నారు అధికారులు. ఇతర ప్రాంతాలలో ఓటు ఉండి మళ్లీ మునుగోడులో ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారిని గుర్తించి వారి అభ్యర్థనలను తిరస్కరిస్తున్నారు. ఇప్పటి వరకు పన్నెండు వేల దరఖాస్తులు మాత్రమే కొత్త ఓటర్లుగా ఎన్నికల అధికారుల నుండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతి పొందారు. పదివేలకు పైగా ఓటర్లు తిరస్కరణకు గురి అయ్యారు. రేపటితో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి దరఖాస్తుల కసరత్తు ముగియనుండటంతో తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇక తుది జాబితా ప్రకటించిన తర్వాత రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వస్తాయనేది తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.