బండిపై పెరుగుతున్న అసమ్మతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై అసమ్మతి పెరిగిపోతోంది. మామూలుగా ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో  విభేదాలను సర్దుబాటు చేసుకుని నేతలందరు ఏకతాటిపైన నడవాలని పార్టీల్లో ఆశిస్తారు. కానీ బీజేపీలో మాత్రం బండిపైన రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోతోంది. బండి వ్యవహారశైలికి వ్యతిరేకంగా గతంలో కూడా కొందరు నేతలు సమావేశమయ్యారు. తర్వాత మీడియాలో మాట్లాడారని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నోటీసులు కూడా ఇచ్చారు.
ఆ నోటీసులు ఏమయ్యాయో వాటికి ఏమి సమాధానం ఇచ్చారో ఎవరికీ తెలీదు. తాజాగా ఎంఎల్ఏ క్వార్టర్స్ లో మాజీ ఎంఎల్ఏ గుజ్జల రామకృష్ణారెడ్డి చింతా సాంబమూర్తి సుగుణాకరరావు వెంకటరమణి డాక్టర్ మల్లారెడ్డి పాపారావు తదితరులు సమావేశమయ్యారు. బండి వ్యవహారశైలిపై మండిపోయారు. పార్టీ అధ్యక్షుడి వైఖరి ఏమాత్రం బాగాలేదని అధిష్టానంకు చెప్పినా ఎవరు పట్టించుకోలేదని అసంతృప్తిని వ్యక్తంచేశారు.
ఈనెలావరకు వెయిట్ చేస్తామని ఒకవేళ బండి వైఖరిలో ఎలాంటి మార్పురాకపోతే ఏదో ఒకటి తేల్చుకుంటామని హెచ్చరించారు. మొదటినుండి బండి ఏకపక్షధోరణితోనే వెళుతున్నారని సమావేశం అభిప్రాయపడింది. పార్టీలోని కార్యవర్గంతో లేదా సీనియర్లతో ఎలాంటి సంప్రదింపులు సలహాలు లేకుండా బండి ఒక్కళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మండిపడ్డారు. బండి వైఖరి వల్ల ఇప్పటికే పార్టీ చాలా నష్టపోయిందని నేతలు మండిపడ్డారు. పార్టీ నష్టపోతున్న తీరును రాష్ట్ర ఇన్చార్జీలకు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేకపోయిందన్నారు. తన సొంత ప్రచారం ఆధిపత్యం కోసమే మొదటినుండి బండి పాకులాడుతున్నట్లు అసమ్మతినేతలు ఆరోపించారు.పార్టీలోని సీనియర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వటంలేదన్నారు. జిల్లాల పర్యటనలకు వచ్చినపుడు కూడా అందరికీ సమాచారం ఇవ్వటంలేదన్నారు. బండిలో మార్పువస్తుందనే ఇంతకాలం వెయిట్ చేసినట్లు చెప్పారు. తాము ఆశించినట్లు మార్పురాకపోతే ఏమి చేయాలనే విషయాన్ని అప్పుడు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కారణం స్పష్టంగా తెలీదుకానీ ఢిల్లీలోని పెద్దల నుండి  అర్జంటుగా రమ్మని బండికి  పిలుపొచ్చింది. అమిత్ షా-చంద్రబాబునాయుడు భేటీ తర్వాతే బండికి పిలుపురావటం గమనార్హం. పొత్తుల విషయంలో మాట్లాడేందుకేనా లేకపోతే అసమ్మతినేతల ఫిర్యాదు కారణంగా పిలిపించారా అన్నది తెలీదు.

Leave A Reply

Your email address will not be published.