ఆకాశం వైపు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న రైతులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే చాలు.. అన్నదాతలంతా పొలం పనుల్లో నిమగ్నమవుతారు. దుక్కి దున్ని విత్తనాలు వేసే పనిలో పల్లెల్లో రైతన్నలు హడావుడిగా ఉంటారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్‌గా ఉంది. జూన్-4వ తారీఖు ఏరువాక పౌర్ణమి అయినా కూడా కనీసం దుక్కి దున్నేందుకు పొలంలోకి వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే.. ఎండలు అంతలా ఠారెత్తిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. వరి, మామిడి రైతుల కళ్లలో నీళ్లు తెప్పించాయి. ఇక అసలు కురవాల్సిన సమయానికి మాత్రం రుతుపవనాలు ఇప్పుడు.. అప్పుడంటూ దోబూచులాడుతున్నాయి. దీంతో రైతులు ఆకాశం ఎప్పుడు కరుణిస్తుందా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

దోబూచులాట..!

నిజానికి జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాలి. గత మూడేళ్లుగా భారత దేశంలోకి రుతుపవనాలు నిర్ణీత తేదీల్లో జూన్‌ మొదటి వారంలోనే దేశంలోకి ప్రవేశించాయి. కానీ ఈసారి మాత్రం దోబూచులాడుతున్నాయి. సర్వసాధారణంగా ఈ పాటికి నైరుతి రుతుపవనాల ఆగమనంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవాలి కానీ ఎండలు మంట పుట్టిస్తున్నాయి. రుతుపవనాలు సముద్రంపైనే నిలకడగా ఉండటంతో.. కేరళ తీరాన్ని తాకేందుకు మరికొంత సమయం పట్టవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాలు కురవాలంటే చాలా రోజులు ఆగాల్సి ఉంటుందని వాతావరణశాఖ అంచనాకు వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. రుతుపవనాల ఆగమనాన్ని బిపర్ జోయ్ తుపాను కదలికలు అడ్డుకుంటున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

అప్పటి వరకూ కష్టమే..!

నిజానికి నేడు కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని నిపుణులు చెప్పడంతో రైతన్నలంతా సంబరపడిపోయారు. కాస్త ఎండ నుంచి ఉపశమనం కలుగుతుందని భావించారు. కానీ మరో 9 రోజుల పాటు అరేబియాలో ఉత్తరంగా కదిలే ఛాన్స్ ఉందని.. ఇది మరింత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గత పది రోజులుగా రుతుపవనాలు అండమాన్, లక్షద్వీప్‌లోనే తిష్ట వేశాయి. ఇవి దేశంలోకి ప్రవేశించాలంటే మరికొద్ది రోజులు పట్టవచ్చు. ఇక కేరళను తాకాలంటే జూన్ 2వ వారం.. అలాగే తెలుగు రాష్ట్రాలను చేరాలంటే జూన్ 3వ వారం వరకూ పట్టే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 3వ వారం వరకూ వాతావరణం చల్లబడే అవకాశమే లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. అవి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్నవి కాదని.. అవి కొనసాగవని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ వర్షాలను నమ్ముకుని గనుక విత్తనాలు వేస్తే మొలకెత్తక పోగా.. ఎండిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాగా.. బిపర్ జోయ్ తుపాను అరేబియా సముద్రంలో ఏర్పడింది. ఈ తుపాను గోవాకు నైరుతి దిశగా 950 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ముంబైకి 1,050 కి.మీ దూరంలో కొనసాగుతున్న ఈ తుపాను గంటకు 4 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో తుపాను మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.