ఆలస్యం  ప్రవేశించనున్న ‘నైరుతి’ రుతుపవనాలు

- ...ఎండల తీవ్రత తప్పదు మరి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 11న ఏపీలోకి నైరుతి రుతుపనాలు ప్రవేశించాయి. 13, 14 తేదీల్లో తెలంగాణ లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. కానీ రుతుపవనాలు రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈనెల 19న తెలంగాణలోకి నైరుతి రుతుపనాలు ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు మోకా, బిపర్‌జోయ్‌ తుపానులు ప్రతిబంధకాలుగా మారాయి. రుతుపవనాల ప్రవేశం నుంచి విస్తరణ వరకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ఫలితంగా ఒకవైపు వడగాల్పులు విజృంభిస్తుంటే, మరోవైపు వర్షాలకు బ్రేకులు పడుతున్నాయి. ఏపీలోకి శ్రీహరికోట పుట్టపర్తి వరకూ విస్తరించిన నైరుతి రుతుపవనాలు అక్కడ నుంచి ముందుకు కదలడం లేదు.దీంతో ఎండలు, వడగాడ్పులతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారుతోంది. అడపాదడపా అక్కడక్కడా వర్షాలు కురిసినా రుతుపవనాలు విస్తరించకపోవడంతో వేడి వాతావరణం కొనసాగుతోంది. అరేబియా సముద్రంలో ఉన్న అతి తీవ్ర తుఫాన్‌ గురువారం సాయంత్రం తీరం దాటనుంది. అనంతరం రెండు రోజుల్లో బలహీనపడుతుంది. అంటే ఈనెల 17వ తేదీ తర్వాతే ఏపీలోని ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని నిపుణులు వెల్లడించారు. దీనికి అనుగుణంగానే ఈనెల 18 నుంచి 21లోగా దక్షిణ భారతం దానికి ఆనుకుని తూర్పు భారతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ బుధవారం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.