రూ. లక్ష ఆర్థిక సహాయం పథకం దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పెంచాలి

- బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ డిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బి.సి కులవృత్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. లక్ష ఆర్థిక సహాయం పథకం దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగించాలని జగిత్యాల జిల్లా బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడిక్క జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన ధృవీకరణ పత్రాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నందున దరఖాస్తుల గడువును పెంచాలని డిమాండ్ చేశారు. మొదట్లో అప్లికేషన్ల స్వీకరణ సజావుగానే సాగినా ఆ తర్వాతి నుండి సర్వర్ మొరాయించడం మొదలయ్యిందన్నారు. దరఖాస్తు నింపేంత వరకు అంతా సజావుగానే సాగినా చివర్లో సబ్మిట్ చేశాక దాన్ని తీసుకోవడం లేదన్నారు. గంట సేపటి దాకా వేచి చూసినా ప్రయోజనం ఉండడం లేదన్నారు. ఈ నెల 20 గడువు విధించడం, ఇంత తక్కువ గడువులోనూ సర్వర్ సతాయించి మొరాయించడం అప్లికేషన్లను తీసుకోకపోవడంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. గత వారం రోజులుగా సర్వర్ సతాయిస్తున్నా ప్రభుత్వం సమస్యను పరిష్కరించడం లేదన్నారు. మరియు తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పొందడానికి లబ్దిదారులు ఆఫీసు వద్ద బారులు తీరుతున్నారని అయినా సర్వర్ మొరాయించడం వల్ల ఆందోళన చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మరియు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతల గంగాధర్, రాష్ట్ర సంయుక్త కార్య నిర్వాహక కార్యదర్శి అలిశెట్టి ఈశ్వరయ్య జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షులు తిరుపురం రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.