ప్రేమ జంటను దారుణంగా హతమార్చిన కుటుంబీకులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రేమజంటను హత్యచేసి రాళ్లుకట్టి.. చంబల్ నదిలో మొసళ్లకు పడేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. పరువుహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.  భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో పరువు హత్యగా అనుమానించే ఓ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రేమజంటను అమ్మాయి తల్లిదండ్రులు హత్య చేశారు. ఆ తరువాత ఆ ప్రేమికులిద్దరి మృతదేహాలకు రాళ్లు కట్టి చంబల్ నదిలోకి విసిరేశారు. ఈ నది పూర్తిగా మొసళ్లతో నింటి ఉంటుంది. దీనిమీద విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల కుటుంబం తెలిపిన ప్రదేశాల్లో డైవర్ల సహాయంతో మృతదేహాల కోసం సోదాలు నిర్వహిస్తున్నట్లు మోరెనా ఎస్పీ శైలేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. “మాకు ఇంకా ఏమీ దొరకలేదు. ఇంకా వెతుకుతున్నాం” అని పోలీసులు తెలిపారు. దీనిమీద మోరీనా జిల్లాలోని అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. వివరాల ప్రకారం, ఈ సంఘటన సుమారు రెండు వారాల క్రితం జరిగింది. అమ్మాయి వేరే వ్యక్తితో ప్రేమలో పడిందని.. అది ఇష్టం లేని అమ్మాయి కుటుంబం, కొంతమంది బంధువులతో కలిసి యువ జంటను కాల్చి చంపి, నదిలో మునిగిపోయేలా వారి మృతదేహాలను పారవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేరం వెలుగు చూడడంతో మృతదేహాల కోసం నదిలో వెతకడానికి పోలీసులు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం, డైవర్లను మోహరించారు. ఈ ఘటన రతన్‌బసాయి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన 18 ఏళ్ల శివాని తోమర్‌ పొరుగు గ్రామమైన బలుపురాకు చెందిన రాధేశ్యామ్ తోమర్ (21)తో ప్రేమలో పడినట్లు సమాచారం. అయితే, వీరిద్దరి కులాలు వేరు కావడంతో వారి కుటుంబీకులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారి ప్రేమ వ్యవహారం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఆ తరువాత జూన్ 3 నుండి, అబ్బాయి,అమ్మాయి ఇద్దరూ కనిపించకుండా పోయారు. రాధేశ్యామ్ తోమర్ కుటుంబం వారిని హత్య చేసిందని అమ్మాయి కుటుంబం పదేపదే ఆరోపించింది. బాలిక కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్ర విచారణ చేపట్టారు. తదనంతరం, శివాని తండ్రి రాజ్‌పాల్ సింగ్ తోమర్, పలువురు బంధువులు.. జూన్ 3న శివాని, రాధేశ్యామ్ తోమర్‌లను కాల్చి చంపారని, ఆపై వారి మృతదేహాలను చీకట్లో చంబల్ నదిలో పడవేసారని ఒప్పుకున్నారు. మృతదేహాలను నదిలో పడేసి ఇప్పటికి 15 రోజులైంది. చేపలు, మొసళ్లు వంటి జలచరాలు వేటాడే అవకాశం ఉన్నందున వాటిని వెలికి తీయడం సవాలుగా మారిందని పోలీసులు తెలిపారు. గత 10 రోజులుగా, రాధేశ్యామ్ తోమర్ కుటుంబ సభ్యులు అంబాహ్ పోలీస్ స్టేషన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం చుట్టూ తిరిగారు. బాలిక కుటుంబం వారిద్దరినీ హత్య చేశారని, మృతదేహాలను పారవేయడంపై దర్యాప్తు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. అయితే, వీరిద్దరూ పారిపోయి ఉండవచ్చని అంబాహ్ పోలీసులు మొదట కేసును కొట్టివేశారు. చాలా రోజుల క్రితం వీరిద్దరూ అదృశ్యమయ్యారని.. పారిపోయి ఉండొచ్చని.. అంబాహ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి ఎస్పీకి, ఇతర సీనియర్ అధికారులకు వివరణ ఇచ్చాడు. అయితే, బాలుడి కుటుంబీకుల వాదనలకు తోడూ.. ఈ జంట గ్రామం విడిచి వెళ్లడాన్ని ప్రత్యక్ష సాక్షులు ఎవరూ చూడలేదు. సైబర్ క్రైమ్ బృందం చేసిన దర్యాప్తు కూడా దీనిమీద ఎలాంటి సాక్ష్యాలను సేకరించలేకపోయింది. దీంతో, పోలీసులు బాలికల కుటుంబాన్ని విచారించారు, ఈ సంఘటనలో కుటుంబ సభ్యులు, బంధువులతో సహా సుమారు 15 మంది వ్యక్తులు పాల్గొన్నారని.. వారు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.  విచారణలో, రాధేశ్యామ్, శివానిలను  జూన్ 3 న హత్య చేసినట్లు బాలిక తండ్రి వెల్లడించాడు. ఆ తరువాత మృతదేహాలను నదిలోకి విసిరేశామని తెలిపారు. ఎస్ డిఆర్ఎఫ్ బృందం, డైవర్లు చంబల్ నదిలో తమ అన్వేషణను కొనసాగిస్తున్నందున, మృతదేహాలను వెలికితీసే వరకు అధికారులు హత్యను నిశ్చయంగా నిర్ధారించలేకపోయారు. మృతదేహాలు లభ్యమైతే తప్ప హత్యను పూర్తిగా నిర్ధారించలేమని పోలీసులు చెబుతున్నారు.  వారిని కాల్చి చంపి మృతదేహాలను చంబల్‌లోకి విసిరేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే నిందితులు మారణాయుధాలు వాడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎస్పీ మోరీనా తెలిపారు. “మృతదేహాలు దొరికితే తప్ప ఏమీ చెప్పలేం” అని విచారణ జరుపుతున్నట్లు అధికారి తెలిపారు

Leave A Reply

Your email address will not be published.