తమ్ముడిని సొంతగూటికి చేర్చేందుకు కోమటిరెడ్డి మంతనాలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: కాంగ్రెస్ సీనియర్ నేతఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరూ లేక ఒంటరిగా ఫీలవుతున్నారా..ఇప్పుడు ఆయనకు ఎవరూ అండగా లేరా..పార్టీలో ఉన్న సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోగా.. శిష్యుడిగా ఉన్న చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు ఆయనకు నా అని చెప్పుకునే వాళ్లెవరూ లేకుండా పోయారా..ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ఇద్దర్నీ ఘర్ వాపసీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారా..అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ వెంకటరెడ్డి ఏం చేయబోతున్నారు..కాంగ్రెస్‌ను కాదని వెళ్లిన వారంతా ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు..అనేది పరిశీలిస్తే  కోమటిరెడ్డి బ్రదర్స్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉంది.. కాంగ్రెస్‌తోనే పొలిటికల్ కెరియర్ ప్రారంభమైంది. వైఎస్ హయాంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ వెలుగు వెలిగారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత బ్రదర్స్ ఇద్దరికీ పరిస్థితులు అనుకూలించలేదు. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ బ్రదర్స్ ఇద్దరూ సిట్టింగ్‌లుగానే ఉంటూ వస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కాషాయ పార్టీలో చేరడం.. రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక రావడం ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలిసిందే. అయితే సొంత తమ్ముడే పార్టీని వీడి వెళ్లడంతో.. వెంకటరెడ్డి కూడా అదేబాటలో నడుస్తారని వార్తలు వచ్చాయి కానీ.. అవేమీ జరగలేదు. మరోవైపు.. కోమటిరెడ్డి శిష్యుడిగా ఉన్న చిరుమర్తి లింగయ్యను రాజకీయాల్లోకి తెచ్చి నకిరేకల్ నుంచి నిలిపి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆయన కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రైట్ హ్యాండ్‌గా ఉన్న తమ్ముడు.. ఇటు శిష్యుడు ఇద్దరూ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో వెంకటరెడ్డి బలం తగ్గిపోయిందని ఫీలవుతున్నారట. అందుకే ఇక ఆ ఇద్దర్నీ తిరిగి కాంగ్రెస్‌లో చేర్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరూ మళ్లీ తనవెంట ఉంటే.. వెయ్యి ఏనుగుల బలమున్నట్లు అని కోమటిరెడ్డి తన అత్యంత సన్నిహితులతో చెప్పుకున్నారట. అందుకే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి సొంత గూటికి చేర్చేందుకు మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Leave A Reply

Your email address will not be published.