భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు.. సీఎం కేసీఆర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: నేడు సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళుతున్నారు. ఉదయం 10 గంటలకు బయలుదేరి సంగారెడ్డి మీదుగా రోడ్డు మార్గాన మహారాష్ట్ర చేరుకోనున్నారు. హైదరాబాద్- ముంబై హైవే మీదుగా భారీ కాన్వాయ్‌తో వెళ్లనున్నారు. సీఎం పర్యటన క్రమంలో సంగారెడ్డి పోలీసులు అలర్ట్ అయ్యారు. హైవేపై 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లే సమయంలో సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల సీఎం ఆగే అవకాశముంది. దీంతో ఎక్కడిక్కడ పోలీసులు భారీగా మోహరించారు.మహారాష్ట్రలో రెండు రోజలు పాటు కేసీఆర్ పర్యటించనున్నారు. కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలు కూడా మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాలను దర్శించుకోనున్న కేసీఆర్.. అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు మహారాష్ట్ర నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇవాళ సాయంత్రానికి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు కేసీఆర్ చేరుకుంటారు.ఇవాళ సాయంత్రం ప్రముఖ నాయకుడు భగీరథ్‌ బాల్కేతో పాటు పలువురు మరాఠా నేతలు బీఆర్ఎస్‌లో చేరతారు. వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్‌లోకి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించనున్నారు. అనంతరం ఇవాళ రాత్రి అక్కడే బస చేస్తారు. అనంతరం మంగళవారం ఉదయం సోలాపూర్‌ జిల్లాలోని పండరీపూర్‌లో విఠోభారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ పూర్తయిన తర్వాత దారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేపు సాయంత్రం తిరిగి షోలాపూర్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు కేసీఆర్ బయలుదేరనున్నారు.

Leave A Reply

Your email address will not be published.