ట్రైన్ వచ్చిందని చెప్పడం మరిచిపోయిన సిబ్బంది

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: కర్ణాటకలోని కలబురిగిలో ఈ గందరగోళం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం ట్రైన్.. కలబురిగి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ 1 దగ్గర ఆగాల్సి ఉంది. రైలు వచ్చింది, ఆగింది, వెళ్లిపోయింది. కానీ ప్రయాణికులు రైలు ఎక్కలేకపోయారు. ఎందుకంటే… రైలు షెడ్యూల్ మారింది. ప్లాట్‌ఫామ్ 1 దగ్గర కాకుండా… మరో ప్లాట్‌ఫామ్ దగ్గర ఆగింది. ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉండగా.. రైల్వే అధికారులు మర్చిపోయారు. దాంతో.. రైలు ఎక్కాలనుకున్న ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. ఉదయ్ బలిగర్, రెహ్మాన్ పటేల్ ఇలా చాలా మంది ప్రయాణికులు.. సికింద్రాబాద్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. వాళ్లు 17319 హుబ్బళి – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ కోసం ఆదివారం ఉదయం 5.45కి ఎదురుచూస్తూ ఉన్నారు. రైలు రోజూలాగే వచ్చి, వెళ్లిపోయింది. వాళ్లు మాత్రం ఎక్కలేకపోయారు. “రైలు ఎప్పుడొస్తుందా అని ఎలక్ట్రిక్ డిస్ ప్లేలో చూస్తూ ఉన్నాం. రైలు 6.32కి వస్తుందని అనౌన్స్ చేశారు. కానీ ఓ ప్లాట్‌ఫామ్ పైకి వస్తుందో చెప్పలేదు. తర్వాత 6.42కి రీ-షెడ్యూల్ చేశారు. 6.45కి డిస్ ప్లే నుంచి రైలు పేరును తొలగించారు. రైల్వే సిబ్బందిని రైలు గురించి అడిగితే.. రైలు మరో ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి, వెళ్లిపోయిందని చెప్పారు” అని ప్రయాణికులు తెలిపారు. సెంట్రల్ రైల్వే ప్రకారం.. రైలు 6.35కి కలబురికి స్టేషన్‌కి వచ్చింది. 6.44కి వెళ్లిపోయింది. వందల మంది ప్రయాణికులు.. స్టేషన్ మేనేజ్ నర్గుందకర్ ఆఫీసుకి వెళ్లి రైలు గురించి అడిగితే.. సిబ్బంది అనౌన్స్‌మెంట్ చెయ్యడం మర్చిపోయారనీ.. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. జరిగిన దానికి క్షమాపణ చెప్పిన ఆయన.. 12701 హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కాలని ప్రయాణికులను కోరారు. ఈ రైలు సికింద్రాబాద్ కాకుండా.. హైదరాబాద్ డెక్కన్‌కి మధ్యాహ్నానికి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ.. తాము నిల్చొని ప్రయాణించాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. చాలా మంది హైదరాబాద్ డెక్కన్ నుంచి.. మళ్లీ సికింద్రాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 8 కిలోమీటర్లు. ఇలా ప్రయాణికులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. చెయ్యాల్సిన ప్రకటన చెయ్యకుండా నిర్లక్ష్యం చేసినందుకు… వందల మంది ప్రయాణికులు రకరకాలుగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది

Leave A Reply

Your email address will not be published.