ఎమ్మెల్యేలే కాదు..మంత్రులకూ టికట్ కట్ ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏ పార్టీ అయినా సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడం మోస్తరు సంచలనం అవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ మంత్రులకు టికెట్ ఇవ్వకపోడం అంటే మరింత సంచలనమే. పదవి కోసం ఎమ్మెల్యేల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నా.. అందులోంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు అంటేనే.. అనేక సమీకరణాలు విశ్వసనీయత సమర్థత అంచనా వేసి తీసుకుంటారు. అలాంటిది వారికే ఎన్నికల్లో టికెట్ నిరాకరించడం అంటే చర్చనీయాంశమే. కాగా తెలంగాణ ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టి కట్” అని ప్రచారం జరుగుతోంది. అయితే మరో ఐదుగురు మంత్రులకూ కేసీఆర్ టికెట్ నిరాకరించనున్నారని తెలుస్తోంది.అందులోనూ ఇద్దరు సన్నిహితులు..కేసీఆర్ టికెట్ ఇవ్వబోరనే మంత్రుల జాబితాలో తొలి పేరు కార్మిక శాఖ చూస్తున్న చామకూర మల్లారెడ్డి. మిగతావారు వరుసగా నిరంజన్ రెడ్డి జగదీశ్ రెడ్డి గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్. వీరిలో మల్లారెడ్డి విద్యా సంస్థలపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఈడీ దాడుల్లో రూ.కోట్లకు పైగా దొరికాయి. మల్లారెడ్డి వ్యక్తిగతంగానూ తన వ్యాఖ్యల ద్వారా చర్చనీయాంశం అయ్యారు. నిరంజన్ రెడ్డి పేరు  ఫాంహౌస్ వ్యవహారంలో బయటకు వచ్చింది. జగదీశ్ రెడ్డి ఎటువంటి వివాదాల్లోనూ లేరు. గంగుల కొప్పుల ఇద్దరూ కరీంనగర్ జిల్లాకు చెందినవారు.

రాజకీయ కారణాలేనా?

ఐదుగురు మంత్రుల్లో మల్లారెడ్డి మినహా నలుగురికి రాజకీయ కారణాలతోనే కేసీఆర్ టికెట్ నిరాకరిస్తున్నట్లగా కథనాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ కు ఆయువుపట్టయిన ఉమ్మడి కరీంనగర్ లో బీజేపీ ఎదుగుదలను ఈటల రాజేందర్ ను ఎదుర్కొనలేకపోయారనేది గంగుల కొప్పుల మీద ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిని వైఫల్యంగా చూస్తున్న పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వబోవడం లేదంటున్నారు.ఇక పీసీసీ చీఫ్ రేవంత రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పుంజుకోవడం నిరంజన్ రెడ్డికి చేటు చేసింది. ఇదే అంశం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డికీ వర్తించనుంది. అయితే వీరిద్దరూ సీఎం కేసీఆర్ కు ఆప్తులు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచీ ఉన్నవారు. కొప్పుల ఈశ్వర్ సైతం అంతే. ఒకవేళ ఊహాగానాలే నిజమై వీరికి టికెట్ నిరాకరిస్తే మాత్రం అది పెద్ద సంచలనమే.

Leave A Reply

Your email address will not be published.