ఘనంగా ఆషాడ బోనాల ఉత్సవాలు

: మంత్రి తలసాని

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం అంబర్ పేట లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద జులై 16 వ తేదీన నిర్వహించే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి బోనాల ఉత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా బోనాలను ప్రజలు గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతో వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని వివరించారు. దేశంలో ప్రైవేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఈ నెల 22 వ తేదీన గోల్కొండ లో బోనాలు ప్రారంభమైనాయని, వచ్చే నెల 9 వ తేదీన సికింద్రాబాద్ మహంకాళి బోనాలు నిర్వహించడం జరుగుతుందని, 16 వ తేదీన హైదరాబాద్ బోనాలు జరుగుతాయని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలకు వారం ముందే ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెల 10, 11 తేదీలలో 16 వ తేదీన బోనాల ఉత్సవాలు నిర్వహించే ఆలయాలకు ఆర్ధిక సహాయం చెక్కులను అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎంతో గొప్పగా నిర్వహించే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో వైభవంగా బోనాలను నిర్వహించేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, ఆలయాల వద్ద భారికేడ్ లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. భక్తులు, వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాపిక్ పోలీసులు వాహనాలను దారిమళ్లించే విధంగా చర్యలు తీసుకుంటారని  పేర్కొన్నారు. అదేవిధంగా విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయాల పరిసరాలలో, బోనాలను తీసుకొచ్చే రహదారులలో ఎక్కడా సీవరేజ్ లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులకు త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహంకాళి ఆలయం ముందున్న ప్రధాన రోడ్డు నిర్మాణం చేపట్టి భక్తులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆలయాల పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు అదనంగా పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా పరిసరాలలో అవసరమైన చోట్ల అంతర్గత రహదారుల అభివృద్ధి పనులు కూడా చేపట్టాలని అన్నారు. అభివృద్ధి పనులను బోనాలకు ఉత్సవాల నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.