సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు

- జూలై 5 న విజయవాడలో సోషల్ మీడియా పై  సెమినార్ - సోషల్ మీడియా పై న్యాయ,పోలీస్ వ్యవస్థల్లో సమీక్షలు జరగాలి - జుగుప్సాకరమైన పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలకు పటిష్టమైన చట్టాలుఉండాలి - మహిళలపై మహిళలే సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం బాధాకరం - రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు  తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు ట్రోల్ చేయడం రాతియుగంలో కూడా లేని హీనత్వాన్ని తలపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై  అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన విషయం అన్నారు.  యు.కె. లో ఉంటున్నటు వంటి ఒక మహిళ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి కుటుంబ మహిళలపై సోషల్ మీడియాలో ఎంతో బాధాకరమైన పోస్టులు పెట్టడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. అయితే అటు వంటి వారిని ప్రతి పక్షాల వారు సమర్థించడం అనేని ద్వంద నీతికి నిదర్శనమన్నారు. ఇటు వంటి సందేశాలు ఇవ్వడం ద్వారా వారు  సమాజానికి ఎటు వంటి సంకేతాలు ఇస్తున్నారు అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైర్ పెర్సన్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టుకు పోస్టు పెట్టడమే సమాదానం కాదని మరియు ఎంత మాత్రం సమర్థనీయం కూడా కాదని ఆమె స్పష్టం చేశారు.                                                                                                                                                                                             సోషల్ మీడియా సమాజంలో సృష్టించే దారుణాతి దారుణమైన పరిస్థితులను నియంత్రించడంలో న్యాయ, పోలీస్ వ్యవస్థలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులో ఉండటం  వల్ల సమస్య మరింత జఠిలం అవ్వడానికి  దారితీస్తున్నదన్నారు. సోషల్ మీడియా దాడిని యాసిడ్ దాడులు, హత్యా యత్నాలతో సమానంగా చూడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వ్యక్తిత్వ హననం హత్య కంటే దారుణంగా మారినప్పుడు చట్టాలకు పదును పెట్టి అదుపుతప్పున సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసం ఎంతో ఉందన్నారు.                                                                                                                                                                                                      ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకురావల్సిన ఆవశ్యకతపై పలువురి సూచనలు,సలహాలను స్వీకరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 5 న విజయవాడలో ఒక సెమినార్ ను నిర్వహించనున్నట్లు మహిళా కమిషన్ చైర్ పెర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.  సమాజంలోని మేథావులు, సంఘ సంస్కర్తలు, విద్యావంతులు ఈ సెమినార్ లో పాల్గొని సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తమ కార్యాలయానికి మెయిల్ ద్వారా కూడా సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని ఆమె తెలిపారు.                                                                                                                                                                                     పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాదానం చెపుతూ తమ కమిషన్ కు వచ్చిన పిర్యాధులు అన్నింటిపై సత్వరమే చర్యలు తీసుకోనేందుకు పోలీస్ శాఖకు ముఖ్యంగా సైబర్ క్రైం వారికి పంపించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.