వరంగల్‌ మోదీ సభకు సీఎం కేసీఆర్‌ వెళ్తారా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్‌లో బీజేపీ నిర్వహించనున్న సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇక వరంగల్‌లో నిర్వహించనున్న మోదీ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం పంపింది. మరి ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారాలేదా అనే దానిపై తెలంగాణలో పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ నడుస్తోంది.చాలా కాలంగా ప్రధాని మోదీ తెలంగాణలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారంటే.. కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికిన దాఖలాలు కూడా లేవు. జాతీయ పార్టీ ప్రారంభానికి ముందు నుంచే ప్రధాని తెలంగాణలో నిర్వహించే కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా బీజేపీపై కేసీఆర్ తన వైఖరి మార్చుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులుశాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగా ఇటీవలి కాలంలో తన ప్రధాన ప్రత్యర్థి స్థానం నుంచి బీజేపీని ఆయన తప్పించారో లేదంటే.. మోదీ విషయంలో తన వైఖరే మారిపోయిందో కానీ ఇటీవల అయితే బీజేపీ లేదంటే మోదీ విషయంలో పెద్దగా కేసీఆర్ బాణాలు ఎక్కుపెట్టడం లేదు. పరిస్థితులకు అనుకూలంగా ఆయన కూడా మారినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ హాజరవుతారాలేదాఅనేది ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.