కవిత పిటిషన్ పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఆమెకు సమన్లు పంపి ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఆమెను విచారించారు. అయితే, ఈడీ సమన్లను, ఆమెను విచారించడానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారించాల్సింది. కానీ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేని కారణంగా కోర్టు నెంబర్ 2, 8లలో కార్యకలాపాలు రద్దయ్యాయి. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పైనా విచారణ వాయిదా పడింది. ఈ రోజుల కోర్టు నెంబర్ 2, 8 లలో రద్దయిన పిటిషన్ల విచారణ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు  చేయాలని ఆమె ఈ పిటిషన్‌లో కోరారు. తనపై ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలనూ తీసుకోకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. అంతేకాదు, ఈడీ విచారించదలిస్తే..  తాను మహిళ అయినందున ఈడీ ఆఫీసుకు పిలవకుండా తన ఇంటికే ఈడీ సిబ్బంది వచ్చి విచారించాలని, అందుకు తాను సహకరిస్తానని కూడా పేర్కొన్నారు. గతంలో నళిని చిదంబరం సహా పలువురిని ఈడీ ఇలాగే వారి ఇంటికి వెళ్లి విచారించింది. Also Read: పేషెంట్‌తో నర్సు ఎఫైర్.. హాస్పిటల్‌లో సెక్స్ చేస్తుండగా మరణించిన పేషెంట్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడం రాజకీయంగా దుమారం రేపింది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. తాజాగానూ బీఆర్ఎస్, బీజేపీకి మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని, అందుకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కల్వకుంట్ల కవితపై ఈడీ దూకుడు వేగానికి కళ్లెం వేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపరణలను ప్రధానం చేసుకుని కొన్ని రోజులుగా రాజకీయ వ్యాఖ్యానాలు జోరుగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏం చెబుతున్నదనే అంశం ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.