ఈటల రాజేందర్‌ కు భద్రతను పెంచిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. పోలీసు ఉన్నతాధికారుల నుంచి అందిన నివేదిక మేరకు ఈటలకు వై ప్లస్‌ భద్రత కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఈటల ఇంటికి సీఆర్పీఎఫ్ ఇంటెలిజెన్స్‌ అధికారులు వచ్చారు. ఇటీవల ఈటలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఈటలకు తగిన భద్రత కల్పిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అనంతరం ఈటల భద్రతపై మేడ్చల్‌ డీసీపీ సందీప్‌ డీజీపీకి నివేదిక ఇచ్చారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు తన ఇల్లు, కార్యాలయం పరిసరాల్లో తిరుగుతున్నారంటూ ఈటల రాజేందర్‌ ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు ఈటలకు 2 ప్లస్‌ 2 భద్రత ఉండేది. వై ప్లస్‌ భద్రత నేపథ్యంలో ఇకపై మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారు. ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు చొప్పున పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్స్‌(పీఎ్‌సఓ)లు రోజుకు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు. మరో ఐదుగురు గార్డులు ఈటల ఇల్లు, కార్యాలయం వద్ద భద్రతా విధుల్లో ఉంటారు.

Leave A Reply

Your email address will not be published.