ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని వ్యతిరేకిస్తున్నాం

- సీఎం కేసీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతున్నదని, విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామని కేసీఆర్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూ మతాన్ని ఆచరించే ప్రజలూ అయోమయానికి లోనవుతున్నారని సీఎం అన్నారు. సోమవారం నాడు.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమైంది. ఈ సమావేశంలో ఎంఐఎం అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్భరుద్దీన్, మంత్రులు మహమూద్ అలీ, కేటిఆర్, బోర్డు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమౌతున్నది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా గత తొమ్మిదేళ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. అందుకే బీజేపీ తీసుకోవాలనుకుంటున్న యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంటు సమావేశాల్లో వ్యతిరేకిస్తాం. అంతే కాకుండా భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొని ఈ బిల్లుపై పోరాడుతాం అని ముస్లిం సోదరులకు కేసీఆర్ హామీ ఇచ్చారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ.. ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. పార్లమెంట్‌లో కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. ‘బీజేపీ సర్కార్ తెస్తామని అంటున్నారు. కాబట్టి దీనిని వ్యతిరేకించాలని కేసీఆర్‌ను కోరాం. తెలంగాణలో శాంతి నెలకొని ఉంది. సిఏఏ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మొదటగా తీర్మానం చేసింది. తీసుకురావడం ద్వారా దేశంలో ఉన్న భిన్నత్వాన్ని దెబ్బతీయాలని మోడీ సర్కారు కుట్ర చేస్తోంది. కేవలం ముస్లింలకు మాత్రమే కాదు .. హిందువులతో పాటు క్రిస్టియన్లలోని వివిధ ఆదివాసి వర్గాలకు ఇబ్బందే. దేశంలో భిన్నత్వము ఉండటం మోడీకి ఇష్టం లేదు. కేసీఆర్ ఒక అడుగు ముందుకెవెళ్ళి యూసీసీపై బావ సారూప్యత కలిగిన పార్టీలతో మాట్లాడతానని మాటిచ్చారు. త్వరలో ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిని కలిసి ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరతాం’ అని ఓవైసీపీ మీడియాకు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.