ఏపీ విద్యార్థులకు తెలంగాణలో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి?..

-  ప్రశ్నించిన హైకోర్టు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలోని మెడికల్‌ కాలేజీల్లో ఏపీ విద్యార్థులు ఎలా రిజర్వేషన్లు కోరుతారని హైకోర్టు ప్రశ్నించింది. కాంపిటేటివ్‌ ఆథారిటీ కోటాలో ఏపీ విద్యార్థులకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలన్న సందేహాన్ని లేవనెత్తింది. కాంపిటేటివ్‌ అథారిటీ కోటాలోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జారీచేసిన 72 జీవోకు వ్యతిరేకంగా ఇద్దరు ఏపీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామారాపు రాజేశ్వర్‌రావుతో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఏపీ విభజన అనంతరం రెండు రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించేందుకు 15% సీట్లను రిజర్వు చేశారని, దానికి విరుద్ధంగా ఇప్పుడు 72 జీవో జారీ అయిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఆలిండియా కోటాలో 15% సీట్లు ఉన్నప్పుడు మిగిలిన సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందుతాయి కదా? అని ప్రశ్నించింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదన వినిపిస్తూ.. రాష్ట్ర విభజన నాటికి ఉన్న సీట్లకే 15% రిజర్వేషన్లు పరిమితమని తెలిపారు. చట్టం అంతవరకే అనుమతి ఇచ్చిందని, ఆ సీట్లలో ఏపీ రాష్ట్ర విద్యార్థులు రిజర్వేషన్లు పొందుతున్నారని చెప్పారు. 2014 తర్వాత ఏర్పాటైన కాలేజీల్లో 15% సీట్లు ఆలిండియా కోటాలోకి పోయాక మిగిలిన సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందుతాయని, ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం 72 జీవో జారీచేసిందని వివరించారు. కొంత గడువిస్తే పూర్తి వివరాలతో సమగ్రంగా కౌంటర్‌ దాఖలు చేస్తామని చెప్పడంతో అందుకు ధర్మాసనం అనుమతించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ లోగా అడ్మిషన్ల కోసం పిటిషనర్లు దరఖాస్తు చేసుకునేందుకు, రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు, కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ అడ్మిషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.