బంగారు తెలంగాణ ఎక్కడ కేసీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కెసిఆర్ పదేపదే రాష్ట్రం బంగారు తెలంగాణగా మార్చడమే తన ధ్యేయమని చెప్పుకుని తన కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి బీర్కూర్ లో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఅర్ ఒక మోసగాడు అని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంతా మోసమే చేస్తున్నారని ధ్వజమెత్తారు. పథకాలు పేరు చెప్పి ఒక్కటైన అమలు చేశారా అని ప్రశ్నించారు. వరి వేసుకుంటే ఉరి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను మోసం చేశారన్నారు. కళ్లముందు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం చేతకావడం లేదని విమర్శించారు.
ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వానపడినట్లే కెసిఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 13 లక్షల కొత్త పెన్షన్ లు పెండింగ్ లో ఉన్నా పింఛన్లు అందించడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 70 వేల కోట్లు తిన్నారని, తిన్న డబ్బులతో ఇప్పుడు కేసీఅర్ దేశాల మీద పడ్డారని అన్నారు. తమ పార్టీ అధికారం లోకి వస్తే వైఎస్సార్ అమలు చేసిన ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా అని తెలిపారు. బిజెపి టీఆర్ఎస్ పార్టీలు దొందు దొందేనని వాటి వల్ల ప్రజలకు ఉపయోగమేమీ లేదన్నారు. పాదయాత్ర లో భాగంగా బీర్కూర్ గ్రామ శివారులోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక మేటలు పరిశీలించి ఇసుక దోపిడీ గురించి స్థానికులు అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో భాగంగా బీర్కూర్ గ్రామ శివారులో రాత్రి షర్మిల బస చేశారు.

Leave A Reply

Your email address will not be published.