ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్‌ లింక్‌

-      ఆర్డినెన్స్‌ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు, సేవలు పొందాలంటే లబ్ధిదారులు తమ ఆధార్‌ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై తాజాగా ఆర్డినెన్స్‌ జారీ చేసింది. శుక్రవారం నుంచే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని తెలిపింది. ప్రజల వ్యక్తిగత సమాచారంతో కూడిన ఆధార్‌కు గోప్యత అవసరమని, దానిని నిర్బంధం చేయకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే రూలింగ్‌ ఇచ్చింది. అయినప్పటికీ… ఆధార్‌ సహా ప్రజలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తూనే ఉంది. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బట్వాడా చేయడంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆధార్‌ నంబరు ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం 2016లో బిల్లు (ఆధార్‌ యాక్ట్‌-2016)ను ఆమోదించిందని… దానిని ఇప్పటికే దేశంలోని 16రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు… కేంద్రం ఒత్తిడి మేరకు ఏపీలో కూడా దీనిని అమలు చేస్తున్నామని పేర్కొంటున్నారు.ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేనందున గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు తెలిపారు. ఆధార్‌ యాక్ట్‌-2016, దాని సవరణలకు అనుగుణంగా ఒక నిర్దిష్ట కొత్త చట్టం చేయనున్నట్లు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. దీన్ని ఏపీ ఆధార్‌ ఆర్డినెన్స్‌-2023గా పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్‌ అమలులోకి వచ్చిన 3నెలల తర్వాత ఏయే పథకాలకు ఆధార్‌ తప్పనిసరో వివరిస్తూ జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. ఆధార్‌ వివరాలు ఇవ్వడంపై లబ్ధిదారులకు ఎలాంటి అభ్యంతరాలున్నా చెల్లవని… ప్రభుత్వం, అధికారులు, ఉద్యోగులపై ఎలాంటి దావాలు, ప్రాసిక్యూషన్‌, ఇతర చట్టపరమైన చర్యలకు తావుండదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆధార్‌ లేనివారితో కొత్తగా నమోదు చేయించి… ఆ గుర్తింపుతో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.