మోదీ అంత బలవంతుడైతే 30 పార్టీలను ఎందుకు పిలిచినట్టు?

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: మోదీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతోనే విపక్ష పార్టీలన్నీ ఐక్యతా సమావేశాలు జరుపుతున్నాయని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. విపక్షాలన్నింటి కంటే ఆయన బలమైన వారైతే, విపక్షాలను ఒంటిచేత్తో ఎదుర్కోగలిగే సామర్థ్యం ఆయనకు ఉంటే ఎన్డీయే సమావేశానికి 30 పార్టీలను ఎందుకు పిలిచారని ఖర్గే ప్రశ్నించారు. విపక్షాల ఐక్య కూటమి యత్నాల్లో భాగంగా బెంగళూరులో సోమ, మంగళవారాల్లో నిర్వహిస్తున్న విపక్షాల సమావేశం సందర్భంగా ఖర్గే మీడియాతో మాట్లాడుతూ, ఏ వ్యక్తి కూడా దేశం కంటే గొప్పకాదని అన్నారు.ఎన్డీయే ఏర్పాటు చేస్తున్న సమావేశంపై మాట్లాడుతూ.. ”విపక్షాలన్నీ కలిసినా వాటికంటే ఆయన (మోదీ) బలవంతుడు అయితే, ఆయనొక్కడే విపక్షాలను ఎదుర్కొనే సమర్ధుడైతే ఎన్డీయే సమావేశానికి దాదాపు 30 పార్టీలను ఎందుకు పిలిచినట్టు? ఆ పార్టీల పేర్లేమిటో వెల్లడించమనండి. ఆ పార్టీలు ఎన్నికల కమిషన్ ముందు రిజిస్టర్ అయిన పార్టీలేనా? ప్రజలు ఎప్పుడూ మాతోనే ఉన్నారు. విపక్షాల ప్రయత్నాల చూసి బెంబేలెత్తుతున్నందునే తమ బలాన్ని చాటుకునేందుకు ఆయా పార్టీల చీలిక వర్గాలను పోగుచేస్తున్నారు” అని ఖర్గే నిశితంగా విమర్శించారు.

ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడంపై..

ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించడంపై ఖర్గే మాట్లాడుతూ, ఇదేదో ఒక వ్యక్తి కోసం తీసుకున్న నిర్ణయం కాదని, ప్రజాస్వామ్యానికి, దేశ రాజ్యాంగానికి బలమైన దెబ్బ పడుతుంటే ఆ రెంటినీ కాపాడేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఏ వ్యక్తీ దేశం కంటే మిన్నకాదని అన్నారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్‌ఎండ్ హోటల్‌‌లో జరిగే విపక్ష నేతల సమావేశం మల్లికార్జున్ ఖర్గే సోమవారం సాయంత్రం 6 గంటలకు చేసే ప్రసంగంతో ప్రారంభం కానుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు 26కు పైగా ప్రతిపక్షాల నేతలు ఈ సమావేశాల్లో పాల్గోనున్నారు.

Leave A Reply

Your email address will not be published.