బట్టబయలైన ఓ నిత్య పెళ్లి కొడుకు ఉదంతం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఓ నిత్య పెళ్లి కొడుకు ఉదంతం బెంగళూరులో బయపడింది .తానొక డాక్టర్‌ని అని, ఇంజనీర్‌ని అని నమ్మించి ఏకంగా 15 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా వారి నుంచి వివిధ రూపాల్లో ఏకంగా 3 కోట్ల రూపాయలను దోచుకున్నాడు. అలాగే పిల్లలను కూడా కన్నాడు. విచారణలో తేలిన సంచలన విషయాలను చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారంటే మనోడు ఏ స్థాయిలో అమ్మాయిలను ట్రాప్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 35 ఏళ్ల మహేష్ కేబీ నాయక్ 5వ తరగతి వరకు చదువుకున్నాడు. చదువు మధ్యలోనే ఆపేసి సినిమాల్లో నటించే అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాడు. కానీ అతని ప్రయత్నాలేవి ఫలించలేదు.అనంతరం పెళ్లి సంబంధాలను కుదిర్చే మ్యాట్రీమోనీ వైబ్‌సైట్‌లో తన వివరాలను రిజిస్టర్ చేసుకున్నాడు. షూట్ బూట్ వేసుకుని మంచి మంచి ఫోటోలను అందులో అప్‌లోడ్ చేశాడు. తాను డాక్టర్‌ని అని, ఇంజనీర్‌ను అని, వ్యాపారవేత్తను అని చెప్పుకోని మహిళలను నమ్మించేవాడు. మహేష్ ప్రధానంగా మధ్య వయస్కులను, వితంతువులన లక్ష్యంగా చేసుకునేవాడు. మాయ మాటలు చెప్పి అమ్మాయిలను పెళ్లి చేసుకునేవాడు. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం కాపురం చేసేవాడు. ఆ తర్వాత వివాహం చేసుకున్న భార్యను మోసం చేసి డబ్బు, నగదు తీసుకోని పరారయ్యేవాడు. ఆ తర్వాత మళ్లీ అదే విధంగా మ్యాట్రీమోనీ సైట్‌లో నాటకం ఆడి మరో మహిళను వివాహం చేసుకునేవాడు. అలా ఇప్పటివరకు ఒకరు కాదు, ఇద్దరు కాదు గత 10 సంవత్సరాల వ్యవధిలో ఏకంగా 15 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు భార్యలతో 5 మంది పిల్లలను కన్నాడు. కనీసం ముగ్గురు మహిళల నుంచి రూ.3 కోట్లను దోచుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్కడితో కూడా ఆగలేదు. మరో 9 మంది మహిళలను పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక్కడ మరొక ఆసక్తికర విషయమేమిటంటే పెళ్లి వేడుకల సమయంలో తన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అంటూ కిరాయి మనుషులను తీసుకొచ్చేవాడట. తన బంధువుల మాదిరిగా నటించినందుకు వారికి రూ.3,000 నుంచి రూ.10,000 వరకు ఇచ్చేవాడట.

ఇలా తన మోసాల్లో భాగంగానే ఈ ఏడాది జనవరి 1న విశాఖపట్నానికి చెందిన ఐటీ ఇంజనీర్ హేమలత(45) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 22 డిసెంబర్ 2022న ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ షాదీ.కామ్‌లో హేమలతతో మహేష్‌కు పరిచయం ఏర్పడింది. తనను డాక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. తనకు మైసూరులో సొంత ఇల్లు కూడా ఉందని నమ్మబలికాడు. ఈ ఏడాది జనవరి 1న విశాఖపట్నంలో ఇద్దరి వివాహం జరిగింది. వివాహం అనంతరం ఇద్దరు మైసూర్ వెళ్లారు. ఆ తర్వాత పని ఉందని చెప్పి మహేష్ 3 రోజులు బయటికి వెళ్లాడు. ఆ తర్వాత తాను క్లినిక్ పెట్టాలని అనుకుంటున్నానని, అందుకు రూ.70 లక్షలు ఇవ్వాలని హేమలతను అడిగాడు. ఆమె ఇవ్వడానికి నిరాకరించడంతో బెదిరించాడు. ఫిబ్రవరి 5న రూ.15 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం తీసుకుని ఇంటి నుంచి పరారయ్యాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి హేమలత పోలీసులను ఆశ్రయించింది.ఇంతలోనే బెంగళూరుకు చెందిన దివ్య అనే మహిళ మహేష్‌ను వెతుక్కుంటూ మైసూర్‌లోని హేమలత ఇంటికి వచ్చింది. దీంతో తాను కూడా మోసపోయానని దివ్య గ్రహించింది. ఇద్దరు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసుకున్న పోలీసులు నిత్య పెళ్లి కొడుకు మహేష్‌ను అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన పోలీసులు నిత్య పెళ్లి కొడుకు మహేష్ మోసాల గురించి తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా మహేష్ వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, 2 కార్లు, 7 మొబైల్ ఫోన్లు, ఒక ఉంగరం, బ్రాస్‌లెట్, నెక్లెస్, రెండు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కాగా మహేష్‌కు వారి కుటుంబసభ్యులతో చాలా కాలంగా సత్సబంధాలు లేవని పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.